Cinema Tickets Issue : మెగాస్టార్ చిరంజీవి పెద్దరికం, సినీ పరిశ్రమకు మేలు చేస్తోంది. ఆయన పెద్దరికాన్ని కొందరు అర్థం పర్థం లేకుండా వ్యతిరేకించొచ్చుగాక.. చిరంజీవి స్థాయిని తగ్గించేందుకు అడ్డమైన వేషాలూ వెయ్యొచ్చుగాక. కానీ, చిరంజీవి స్థాయి ఏంటో తెలిసినవారు సినీ పరిశ్రమలో చాలామందే వున్నారు. పరిశ్రమకు తన సాయం అవసరమైనప్పుడు, పరిశ్రమ బిడ్డగా తాను ముందుంటానని తరచూ చెప్పే చిరంజీవి తన మాటను నిలబెట్టుకున్నారు.
సినీ పరిశ్రమ సమస్యల విషయమై వైఎస్ జగన్ సర్కారుతో మెగాస్టార్ చిరంజీవి గత కొంతకాలంగా సంప్రదింపులు జరుపుతున్న సంగతి తెలిసిందే. ‘అది వ్యక్తిగతం..’ అని ఎవరన్నా విమర్శించొచ్చుగాక. కానీ, చిరంజీవి తన ప్రయత్నాల్ని ఆపలేదు. ఫలితంగా, పరిశ్రమకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లభించింది.
మహేష్‌బాబు, ప్రభాస్, కొరటాల శివ, రాజమౌళి తదితరుల్ని వెంటేసుకుని చిరంజీవి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా, పరిశ్రమ సమస్యల్ని ముఖ్యమంత్రి ముందుంచారు చిరంజీవి.
భేటీలో, పరిశ్రమ సమస్యల గురించి సవివరంగా తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, త్వరలోనే అన్ని సమస్యలకూ పరిష్కారం లభిస్తుందన్న భరోసా ఇచ్చారట. ఈ నెలాఖరులోగా సానుకూల జీవో వస్తుందని మెగాస్టార్ చిరంజీవి ఆకాంక్షించారు.
చిరంజీవి చొరవతోనే ఇదంతా సాధ్యపడిందని మహేష్, ప్రభాస్, రాజమౌళి తదితరులు చెప్పుకొచ్చారు. అయితే, సినిమా టిక్కెట్ల వివాదం ఓ కొలిక్కి వస్తుందా.? ఈ విషయమై వైఎస్ జగన్ సర్కార్ గతంలో చేసిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందా.? వేచి చూడాల్సిందే.