మనం మూవీస్,బుక్స్, సీరియల్స్ లలో గ్రాండ్ పేరెంట్స్, గ్రాండ్ చైల్డ్రెన్స్ యొక్క ప్రేమ గురించి ఎంతో చదివి, చూసి ఉంటాం. ఇప్పుడు తాజాగా జరిగిన, జరుగుతున్న సంఘటనలను చూస్తేంటే అవన్నీ కల్పితాలని, నిజ జీవితంలో పిల్లలను అమ్మడానికి, చంపడానికి కూడా వెనకాడరని తెలుస్తుంది. మనుషుల్లో మానవత్వం చచ్చిపోతుందని చెప్పడానికి ఈ సంఘటన నిదర్శనం. కరీంనగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రోజుల వయసు గల ఓ పసిపాపను విక్రయించడం కలకలం రేపుతోంది.
ఇందుకు పాల్పడింది ఆ శిశువు అమ్మమ్మే కావడం గమనించదగ్గ విషయం. శుక్రవారం ఈ ఘటన జరిగింది. కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో నాలుగు నెలల పసికందును అమ్మమ్మ అమ్మేసింది. పసిపాపను పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామానికి చెందిన తిరుపతమ్మ సంపత్ దంపతులు రూ.1.1 లక్షలకు కొనుగోలు చేసినట్లు తేలింది. అయితే, ఈ అమ్మకం వ్యవహారం కన్నతల్లికి తెలికపోవడం గమనార్హం.
కూతురు కనిపించకపోవడం వల్ల కన్నతల్లి పద్మ, తన మీద అనుమానంతో నిలదీసింది. తన భర్త రమేష్ కు పద్మ ఫోన్ చేయడంతో ఆయన గ్రామానికి చేరుకొని అత్తతో గొడవకు దిగడంతో అసలు విషయం బయటపడింది. ఈ విషయం అప్పటికే స్థానికంగా అందరికి తెలియడంతో స్థానికులు పోలీసులు సమాచారం అందించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు కలగజేసుకొని విక్రయించిన పసిపాపను మళ్ళీ తల్లి ఒడికి చేర్చారు. శిశు విక్రయానికి పాల్పడ్డ అమ్మమ్మ కనకమ్మను, కొనుగోలు చేసిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. పిల్లలను అమ్మినా, కొనుగోలు చేసినా నేరమని, ఇలా చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు చెప్పారు. అయితే కనకమ్మ తన మనవరాలును ఎందుకు అమ్మిందనే విషయం తెలియదు. ఆడపిల్ల కాబట్టి అమ్మిందో లేక కరోనా వల్ల ఏర్పడ్డ ఆర్థిక ఇబ్బందులు వల్ల అమ్మిందో తెలియదు. కానీ ఒక అమ్మమ్మ తన మనవరాలును అమ్మడం అనే విషయం రాష్ట్రంలో కలకలం రేపుతోంది.