‘మా ప్రభుత్వం సినిమా టిక్కెట్లను విక్రయించాలనుకోవడంలేదు. ఆన్ లైన్ టిక్కెట్ల విక్రయం ద్వారా టిక్కెట్ల విక్రయంలో పారదర్శకత కోసమే ప్రయత్నిస్తున్నాం..’ అంటున్నారు మంత్రి పేర్ని నాని. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సినిమా టిక్కెట్ల విషయమై ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తరఫున ఓ వెబ్‌సైట్ రూపొందించి, దాని ద్వారానే సినిమా టిక్కెట్ల విక్రయం జరిగేలా చేయాలనీ, ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే సినిమా టిక్కెట్లు విక్రయమయ్యేలా చేసేందుకు ఇదొక చక్కటి మార్గమనీ ప్రభుత్వం చెబుతోన్న విషయం విదితమే. అయితే, సినిమా అనేది ప్రైవేటు వ్యవహారం.. దీనిపై ప్రభుత్వ పెత్తనమేంటి.? అన్న చర్చ సినీ పరిశ్రమలో కొందరి నుంచి వ్యక్తమవుతోంది.
అదే సమయంలో కొందరు సినీ ప్రముఖులు ప్రభుత్వ ఆలోచనని సమర్థిస్తున్నారు. కాగా, ‘వకీల్ సాబ్’ సినిమా సమయంలో సినిమా టిక్కెట్ల ధరల్ని ప్రభుత్వం తగ్గించడం, తద్వారా చిత్ర నిర్మాలకీ, పంపిణీదారులకు తీవ్ర నష్టాన్ని కలిగించడం.. ఈ క్రమంలో తలెత్తిన రాజకీయ దుమారం.. అందరికీ తెలిసిందే. కొన్ని సినిమాల విషయంలో టిక్కెట్ల ధరల్ని పెంచుకునేందుకు ప్రభుత్వాలు అనుమతివ్వడం చూస్తున్నాం. కానీ, ఇప్పుడు సీన్ మారింది. కొన్ని సినిమాల విషయంలో ఏపీ ప్రభుత్వ పెద్దలు పనిగట్టుకుని కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. అయినా, ప్రభుత్వమెందుకు సినిమా టిక్కెట్ల ధరల విషయమై అత్యుత్సాహం చూపుతోంది.? టిక్కెట్ల విక్రయం తమ కనుసన్నల్లో జరగాలని పట్టుబడుతోంది.? అన్న విషయమై ప్రజల్లో చాలా రకాల అనుమానాలున్నాయి. అవసరమా ఇదంతా.? అన్న చర్చ వైసీపీలోనే జరుగుతోంది. కానీ, ప్రభుత్వ పెద్దలు మాత్రం ఈ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గేలా కనిపించడంలేదు.