చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్స్ కు చిన్నారి విరాళం..! ముగ్దుడైన మెగాస్టార్

చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్స్.. ప్రస్తుత కరోనా సమయంలో ప్రజలను వైరస్ కంటే తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది ఆక్సిజన్. బాధితులకు ఆక్సిజన్ నిల్వలు అందక మృతి చెందిన వారు దేశంలో చాలా మంది ఉన్నారుఈ పరిస్థితులను చూసిన మెగాస్టార్ చిరంజీవి తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకొచ్చారు. ప్రకటించిన వారంలోపే దాదాపు అన్ని జిల్లాల్లో ప్లాంట్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ ప్లాంట్ల ద్వారా ఆయా ప్రాంతాల్లో అవసరమైన వారికి ఆక్సిజన్ సిలిండర్లు విరివిగా అందుతున్నాయి. సర్వత్రా ప్రశంసలు అందుకుంటున్న ఈ కార్యక్రమంలో ఓ చిన్నారి స్పందించింది. ఈక్రమంలో తాను చేసిన పనికి మెగాస్టార్ ముగ్దుడైపోయారు.

తన పుట్టినరోజు కోసం దాచుకున్న మొత్తాన్ని చిరంజీవి చారిటబుల్ ట్రస్టుకి విరాళంగా ఇచ్చింది. ఈమేరకు చిన్నారి తల్లిదండ్రులు ఈ మొత్తాన్ని చెక్కు రూపంలో అందించారు. జూన్ 1న పి.శ్రీనివాస్, హరిణి దంపతుల గారాలపట్టి అన్షి ప్రభాల పుట్టినరోజు. తాను దాచుకున్న మొత్తం, పుట్టినరోజుకు అయ్యే ఖర్చును చిరంజీవి తలపెట్టిన ఆక్సిజన్ బ్యాంకుల కోసం ఇచ్చింది. ఈ సందర్భంగా చిన్నారి మాట్లాడుతూ.. ‘చుట్టూ ఉన్న సమాజం బాగున్నప్పుడే నిజమైన సంతోషం, ఆనందం ఉంటుంది. అందరూ బాగుంటేనే నేనూ బాగుంటాను. ఈసమయంలో పుట్టినరోజు జరుపుకోవడం కరెక్ట్ కాదు. అందుకే ఈ మొత్తాన్ని చారిటీకి ఇస్తున్నాను’ అని చెప్పింది. ఆమె మాటలకు, ఆలోచనలకు మెగాస్టార్ ముగ్దుడైపోయారు. ఈ సందర్భంగా చిన్నారి అన్షికి కృతజ్ఞతలు చెప్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు.

చిరంజీవి మాట్లాడుతూ.. ‘చిన్నారి ఆలోచన, మంచి మనసు నాలో మరింత ఇన్ స్పిరేషన్ కలిగించింది. ఆమె ప్రేమకు ముగ్దుడినైపోయాను. ఆమె స్పందన నా హృదయాన్ని తాకింది. తన డ్రీమ్స్ నిజమవ్వాలని కోరుకుంటున్నా. ఆమె సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. భగవంతుడు ఈ చిన్నారి చేతుల మీదుగా మా ప్రయత్నానికి చేయూతను ఇస్తూ ఆశీస్సులు అందిస్తున్నాడని భావిస్తున్నా. గాడ్ బ్లెస్ యూ అన్షి.. హ్యాపీ బర్త్ డే.. లవ్ యూ డార్లింగ్’ అంటూ అభినందించి తనకు బర్త్ డే గిఫ్ట్ కూడా పంపారు. ఆ చిన్నారి ఆ గిఫ్ట్ చూసుకుని మురిసిపోతూ మరో వీడియోలో చిరంజీవికి థ్యాంక్స్ చెప్పింది. ప్రస్తుతం ఈ చిన్నారి చారిటీ నెట్టింట్లో వైరల్ అయింది. మరోవైపు మెగా అభిమానులు జిల్లాల్లో ఆక్సిజన్ సిలిండర్లను అవసరమైన వారికి అందిస్తూ చిరంజీవి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.