తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ – జనసేన పార్టీల మధ్య మైత్రి కొన’సాగు’తోన్న విషయం విదితమే. అయితే, అసలు రెండు పార్టీల మధ్యా స్నేహం వుందా.? లేదా.? అన్న అనుమానాలూ తరచూ తెరపైకొస్తుంటాయి.
ఈ మధ్యకాలంలో అయితే, బీజేపీ – జనసేన కలిసి ఏ వేదిక మీదా కనిపించిన దాఖలాల్లేవు. ఎవరి దారిలో వారు తమ తమ పనులు చక్కబెట్టుకుంటున్నారు రాజకీయంగా. తెలంగాణలో అయితే బీజేపీ, జనసేన మధ్య సఖ్యత ఏనాడూ లేదనుకోండి.. అది వేరే విషయం. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కీ మధ్య అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి.
అవే ఈ రెండు పార్టీల మధ్యా కాస్తో కూస్తో స్నేహభావానికి కారణమవుతున్నాయని అనుకోవాలేమో. ఇదిలా వుంటే, గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఇరు పార్టీల మధ్య సఖ్యత కొరవడినట్లే కనిపిస్తోంది. పోలవరం ముంపు ప్రాంతాల్లో బీజేపీ పర్యటనల హడావిడి కొనసాగిస్తోంది. అయితే, ఈ క్రమంలో జనసేన జాడ ఎక్కడా కనిపించడంలేదు.
మరోపక్క, జాబ్ క్యాలెండర్ విషయమై జనసేన సొంతంగా పోరు బాట పట్టేందుకు సమాయత్తమవుతోంది. ఈ విషయంలోకి బీజేపీ అస్సలు తొంగి చూడటంలేదు. బీజేపీతో స్నేహం కొనసాగిస్తే అది పార్టీకి చాలా చేటు చేస్తుందనే అభిప్రాయం జనసైనికుల్లో వుంది. జనసైనికుల ఆవేదన జనసేన అధినేతకు అర్థం కాదని ఎలా అనుకోగలం.? తిరుపతి ఉప ఎన్నిక దగ్గర్నుంచే రెండు పార్టీల మధ్య చిన్నపాటి గ్యాప్ షురూ అయ్యింది.
దాన్ని తమ అవసరాల కోసం తగ్గించుకున్న బీజేపీ, ఆ తర్వాత మాత్రం అవసరం తీరిందన్న కోణంలో మళ్ళీ పెంచేసుకుంటూ పోయింది. ఈ వ్యవహారాలన్నిటినీ జనసేనాని పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా పరిశీలిస్తున్నారట. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుందామంటూ పార్టీ నేతలకు చెబుతున్నారట. ఆ సరైన నిర్ణయం బీజేపీతో జనసేన తెగతెంపులేనా.? వేచి చూడాల్సిందే.