విదేశాల్లో సైతం భారీ అభిమాన గణాన్ని సంపాదించుకున్న ఏకైక ఇండియన్ హీరో సూపర్ స్టార్ రజినీకాంత్ మాత్రమే. బాలీవుడ్ హీరోల్లో షారుక్ ఖాన్ లాంటి వారికి విదేశాల్లో అభిమానులు ఉన్నా రజినీకాంత్ స్థాయిలో మాత్రం లేరనే అనాలి. మలేషియా, సింగపూర్, థాయ్లాండ్, జపాన్ లాంటి దేశాల్లో రజనీకి కల్ట్ ఫాలోయింగ్ ఉంది. రజినీకాంత్ సినిమా అంటే మన ప్రేక్షక జనం ఎంతలా ఎంజాయ్ చేస్తారో అక్కడి రజినీ అభిమానులు కూడ అలానే ఎంజాయ్ చేస్తారు. అందుకే రజినీకాంత్ సినిమాలకు ఆయా దేశాల్లో డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ బాగానే ఉంటుంది.
ఇక తాజాగా రజినీకాంత్ చేసిన కొత్త చిత్రం దర్బార్ మన దగ్గర అంతగా ఆడలేదు. నిక్కచ్చిగా చెప్పాలంటే బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్. బిజినెస్ పరంగా లాస్. ఏ.అర్. మురుగదాస్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం అభిమానుల్ని ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. అలా ఇక్కడ ఫ్లాప్ అయిన ఈ సినిమా జపాన్ దేశంలో మాత్రం సూపట్ హిట్ అనిపించుకుంటోంది. కొన్ని థియేటర్లలో హౌస్ ఫుల్ వసూళ్లతో నడుస్తోంది. ఒక థియేటర్లో అయితే జూలై 21 వరకు అన్ని షోలో హౌస్ ఫుల్ అయ్యాయట. దీంతో అక్కడి డిస్ట్రుబ్యూటర్లు లాభాలు పోసుకుంటున్నారు. అలా మన ప్రేక్షకులకు నచ్చని రజినీకాంత్ సినిమా జపాన్ అభిమానులకి మాత్రం విపరీతంగా నచ్చేసింది.