చత్తీస్ ఘడ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి (74) కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అస్వస్థతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ సమయంలో ఆయనకు రెండుసార్లు గుండెపో టు వచ్చింది. ఆరోగ్యం విషమించడంతో వెంటిలేటర్ పై శ్వాస అందిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే అజిత్ జోగి మరణించిన ట్లు ఆయన కుమారుడు అమిత్ జోగి ట్విటర్ ద్వారా తెలిపారు. అజిత్ జోగి మృతిపట్లు రాజకీయవేత్తలు, సామాజివేత్తలు, బాలీవుడ్ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 2000 సంవత్సరంలో చత్తీస్ ఘడ్ ప్రత్యేక రాష్ర్టంగా ఏర్పాటైన తర్వాత అజిత్ జోగి ఆ రాష్ర్ట తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసారు.
ఆ తర్వాత కొన్నాళ్లకి పార్టీతో విబేధాలు రావడంతో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి జనతా కాంగ్రెస్ చత్తీస్ ఘడ్ పార్టీని స్థాపించారు. గతంలో రోడ్డు ప్రమాదానికి గురైన అజిత్ జోగి గాయపడిన తర్వాత చక్రాల కుర్చీ నుంచే రాజకీయాలు చేసారు. 1946 ఏప్రిల్ 29న బిలాస్ పూర్ లో అజిత్ జోగి జన్మించారు. భోపాల్ లోని మౌలనా ఆజాద్ కళాశాలలో ఇంజనీరింగ్ చదివారు. రాజకీయాలకంటే ముందు ఐఏఎస్ గా ఎంపికై ఎంపీలో ఇండోర్ లో కలెక్టర్ గా విధులు నిర్వర్తించారు. ఆ తర్వాతే కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయవేత్తగా అవతరించారు. 1986-98 మధ్యకాలంలో రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా, అలాగే 1998 లో లోక్ సభ ఎన్నికల్లో రాయగడ నియోజకవ వర్గం నుంచి, 2004లో మహసముండ్ నియోజక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు.