కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరికి రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ అనే ఇమేజ్ వుంది. ఎవర్నయినా, ఎలాగైనా దూషించేయగలరామె. ఎవర్నీ ఆమె లెక్క చేయరని రేణుకా చౌదరి గురించి బలమైన అభిప్రాయం అటు రాజకీయ, ఇటు మీడియా వర్గాల్లో బలంగా వినిపిస్తుంటుంది.
తాజాగా, హైద్రాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఓ నిరసన ప్రదర్శన ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రేణుకా చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, అంతకు ముందు జరిగిన గలాటాలో రేణుకా చౌదరి అగ్గిమీద గుగ్గిలం అయిపోయారు. పోలీసుల మీద విరుచుకుపడ్డారు. బూతులు తిట్టేశారు.
అంతేనా, ఓ పోలీస్‌ని కొట్టే ప్రయత్నం చేయడంతోపాటు, ఇంకో పోలీస్ అధికారి కాలర్ పట్టుకున్నారు. ‘స్టేషన్‌కి వచ్చి తంతా..’ అంటూ పోలీసుల్ని బెదిరించారు కూడా. రేణుకా చౌదరి తీరుతో పోలీసులు నిర్ఘాంతపోయారు. ఎంత సీనియర్ పొలిటీషియన్ అయినాగానీ, పోలీసుల విధి నిర్వహణకు అడ్డు తగలడకూడదు.
ఎలాగూ, పోలీసులు రేణుకా చౌదరి మీద కేసులు నమోదు చేస్తారు. కాలర్ పట్టుకున్నారు గనుక, ఆమెను ఈ కేసులో ఇంకోసారి అరెస్టు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ, తద్వారా ఆమె సింపతీ పొందాలనుకుంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.
ఒకప్పుడు తెలుగునాట రాజకీయాల్లో రేణుకా చౌదరి అంటే ఫైర్ బ్రాండ్. ఇప్పటికే ఆ ఇమేజ్ ఆమెకు అలాగే వుందిగానీ, ఒకప్పటి పాపులారిటీ ఆమెకు ఇప్పుడు లేదు. ఆ పాపులారిటీ కోసమే ఆమె ఇలాంటి పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నారేమో.!