Cancer : క్యాన్సర్‌ని జయించిన ఈ హీరోయిన్ల గురించి తెలుసా.?

Cancer : సినీ నటి హంసానందిని క్యాన్సర్ బారిన పడింది. తెలుగులో ‘అనుమానాస్పదం’ సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ, ఆ తర్వాత ఐటమ్ బాంబుగా మారింది. ‘మిర్చి’ తదితర సినిమాల్లో ఆమె చేసిన స్పెషల్ సాంగ్స్ కాక రేపాయి. సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే వుండే హంసా నందిని, కొన్నాళ్ళుగా సోషల్ మీడియాలోనూ కనిపించకపోవడంతో ఆమె గురించి అభిమానులు ఒకింత ఆందోళన చెందారు.

ఇక, తనకు క్యాన్సర్ సోకిందనే విషయాన్ని తాజాగా వెల్లడించింది అందరికీ పెద్ద షాకే ఇచ్చింది హంసా నందిని. ఆమెకు సర్జరీ కూడా జరిగిందట. ప్రస్తుతం కీమో థెరపీ చేయించుకుంటోందట. కొద్ది రోజుల్లోనే క్యాన్సర్‌ని పూర్తిగా జయిస్తానంటోంది. అయితే, తనకు క్యాన్సర్ తిరిగి వచ్చే అవకాశాలున్నట్లు వైద్య నిపుణులు చెప్పడంతో, మరికొన్ని సర్జరీలు కూడా తప్పవంటోంది.

ప్రస్తుతానికి క్యాన్సర్ నుంచి కాస్త ఉపశమనం కలిగిందనీ, పూర్తిగా జయించడానికి తగిన సమయం పడుతుందనీ, ఈ పోరాటంలో తాను విజయం సాధిస్తాననే నమ్మకం తనకుందని హంసా నందిని పేర్కొంటూ ఓ భావోద్వేగభరితమైన పోస్టుని సోషల్ మీడియాలో వుంచింది.

సోనాలి బింద్రే కూడా గతంలో క్యాన్సర్ బారిన పడింది. ఆమె అయితే, మృత్యువుతో పోరాడింది.. విజయం సాధించింది. మనీషా కొయిరాలా కూడా, క్యాన్సర్‌తో ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళింది. అన్నట్టు, నటి మమతా మోహన్ దాస్ కూడా క్యాన్సర్ బారిన పడిన సంగతి తెలిసిందే. పలుమార్లు ఆమెను క్యాన్సర్ వేధించిందిగానీ, క్యాన్సర్ మీద ఆమె ప్రతిసారీ విజయం సాధిస్తూ వస్తోంది.

కాస్త వెనక్కి వెళితే, సీనియర్ నటి గౌతమి కూడా గతంలో క్యాన్సర్ బారిన పడింది. క్యాన్సర్ విజేతలే కాదు, క్యాన్సర్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన సెలబ్రిటీలు కూడా వున్నారు.