ఈ నెల 6న దేశవ్యాప్తంగా చక్కా జామ్‌ !

కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన మూడు సాగుచట్టాలకు వ్యతిరేకంగా నిరసనోద్యమంలో ఉన్న రైతులపై అధికారుల వేధింపులకు నిరసనగా ఈ నెల 6న దేశవ్యాప్తంగా చక్కా జామ్‌ చేపట్టనున్నట్టు రైతు సంఘాలు ప్రకటించాయి. ఇందులో భాగంగా ఆ రోజున మధ్యా హ్నం 12 నుంచి మూడు వరకు అన్ని జాతీయ, రాష్ట్ర రహదారులను దిగ్బంధిస్తామని పేర్కొన్నాయి. అధికారుల వేధింపులను, నిరసనల వేదికల దగ్గర ఇంటర్నెట్‌పై నిషేధం విధించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించాయి.

6న దేశవ్యాప్తంగా చక్కా జామ్‌

ఈ మేరకు సింఘు సరిహద్దుల వద్ద సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో రైతు నేతలు వివరాలు తెలిపారు. నిరసనల వేదికల దగ్గర విద్యుత్‌, నీటి సరఫరాను అధికారులు నిలిపివేశారని ఆరోపించారు. సాగు చట్టాలను రద్దు చేయడంపైనే తమ పోరాటం కొనసాగుతుందని, అదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి ఎన్ని నిధులు కేటాయించారన్న విషయాన్ని పరిగణించబోమని పేర్కొన్నారు.

బడ్జెట్‌ ప్రతులను చూడటానికి తమ దగ్గర ఇంటర్నెట్‌ సౌకర్యం లేదని, అధికారులే దీనికి కారణమని మండిపడ్డారు. తమ ట్విట్టర్‌ ఖాతాలపై నిషేధాన్ని విధించారని సంయుక్త కిసాన్‌ మోర్చా రైతు నేతలు ఆరోపించారు. మరోవైపు, ఢిల్లీ సరిహద్దుల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎత్తైన సిమెంటు బారికేడ్లు, ముళ్ల కంచెలతో రహదారులు కోటలను తలపిస్తున్నాయి. పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర గురించి ప్రభుత్వం మాట్లాడడం లేదని, తాము ప్రధానితో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నామని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ రుణ లక్ష్యాన్ని పెంచినంత మాత్రాన ప్రయోజనం లేదని, రైతుల ఆదాయాన్ని పెంచే చర్యలు చేపట్టాలని గ్రామీణ్ కిసాన్ మజ్దూర్ సమితి నేత రంజీత్ రాజు పేర్కొన్నారు.