తెలంగాణలో నైట్ కర్ఫ్యూ విధించడంతో సెకండ్ షోలకు అడ్డుకట్టపడింది. కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు ప్రేక్షకులు థియేటర్లకు వస్తారనే నమ్మకం పోయింది. ప్రేక్షకుల్ని అంతలా కవ్వించే సినిమాలేవీ లేవు కూడ. రిలీజ్ కావాల్సినవన్నీ వాయిదాలు పడిపోయాయి. దీంతో ఎగ్జిబిటర్లు డైలమాలో పడ్డారు. ఉన్నదల్లా ఒక్క ‘వకీల్ సాబ్’ చిత్రం మాత్రమే. సినిమా విడుదలై ఇప్పటికే 10 రోజులకు పైగానే గడిచిపోయింది. దాదాపు ప్రేక్షకులు చాలామంది సినిమాను చూసేశారు. ఉన్న థియేటర్లలో కొన్ని ఏరియాల్లో మాత్రమే ఆక్యుపెన్సీ మెరుగ్గా ఉంటోంది.
కొత్త సినిమాలు లేక, ఉన్న సినిమాకు అంత ఆదరణ లేక డీలాపడిన థియేటర్ యాజమాన్యాలు కనీసం ప్రేక్షకుల భద్రతా కోసమైనా ఒక వారం రోజులు సినిమా హాళ్లను మూసివేస్తే బాగుంటుందని అనుకున్నారు. అందుకే ఈ వారం రోజులు థియేటర్లు క్లోజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ ‘వకీల్ సాబ్’ ఆక్యుపెన్సీ ఉన్న హాళ్లు మాత్రం ఈ వారాంతం వరకు నడుస్తాయని ప్రకటించారు. చివరికి ప్రేక్షకుల తాకిడి ఉన్న ఏరియాల్లో వరకు ‘వకీల్ సాబ్’ సినిమానే దిక్కయింది.