బీజేపీలో ఈటెల చేరిక ఆలస్యం వెనుక అసలు కారణమిదేనా.?

Etela's Master Stroke To TRS Soon?

Etela's Master Stroke To TRS Soon?

తెలంగాణ రాష్ట్ర సమితికి దూరమైన మాజీ మంత్రి ఈటెల రాజేందర్, భారతీయ జనతా పార్టీలో అధికారికంగా చేరేందుకోసం చాలా సమయమే తీసుకుంటున్నారు. ఢిల్లీకి వెళ్ళి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ ఇటీవలే నిర్వహించిన ఈటెల, అప్పుడే అధికారికంగా బీజేపీలో చేరిపోతారని అంతా అనుకున్నారుగానీ, అనూహ్యంగా ఈటెల ‘కొంత సమయం’ తీసుకున్నారు. దాంతో, ఈటెల ఎందుకింత గందరగోళానికి గురవుతున్నారు.? అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.

కాగా, ఈటెల చేరిక విషయమై తమకు తొందరలేమీ లేదని బీజేపీ అంటోంది. బీజేపీలో చేరేందుకు ఈటెల నిర్ణయించుకున్నారనీ.. ఎప్పుడు.? ఎలా? అన్నది ఆయనిష్టమేనని బీజేపీ నేతలు చెబుతున్నారు. కాగా పార్టీలు మారేటప్పుడు, తమ బలాన్ని చాటుకునేందుకు నాయకులు ప్రయత్నించడం కొత్తమీ కాదు.  కరోనా నేపథ్యంలో బలప్రదర్శనకు అవకాశం తక్కువ గనుక, ఈటెల సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారట. మరోపక్క, తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన పలువురు కీలక నేతలతో ఈటెల మంతనాలు జరుపుతున్నారని సమాచారం.

పార్టీలో అసంతృప్తులుగా వున్నవారిని తనవైపుకు లాక్కోవాలన్నది ఈటెల వ్యూహంగా కనిపిస్తోంది. తక్కువలో తక్కువ అరడజను మంది చెప్పుకోదగ్గ నేతల్ని అయినా తనతోపాటు బీజేపీలోకి లాక్కెల్లాలని ఈటెల చూస్తోంటే, ఈటెల వ్యూహం బెడిసికొట్టేలా చేయడానికి తెలంగాణ రాష్ట్ర సమితి విపరీతంగా కష్టపడాల్సి వస్తోంది. ఈటెల ఎవరెవరితో మంతనాలు జరుపుతున్నారో, వారికి గులాబీ పార్టీ రకరకాల తాయిలాలు ప్రకటించడమే కాదు, తాయిలాలకు లొంగకపోతే బెదిరింపులకు సైతం దిగుతోందట.

ఈ పరిణామాలన్నిటినీ బీజేపీ జాగ్రత్తగా గమనిస్తోంది. ఈటెల రాజేందర్ బీజేపీలో చేరిపోయినట్టేననీ, ఆయన విషయంలో తాము ప్రత్యేకంగా ఆలోచించడానికి ఏమీ లేదనీ, పార్టీలో ఆయనకు తగిన ప్రాధాన్యత దక్కుతుందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తాజాగా వ్యాఖ్యానించారు.