ఈటెల రాజేందర్ ఇటీవలే తెలంగాణ రాష్ట్ర సమితికి రాజీనామా చేశారు. మంత్రి వర్గం నుంచి తనను తొలగించిన తర్వాత వేగంగా నిర్ణయాలు తీసుకునన ఈటెల రాజేందర్, మధ్యలో కాస్త నెమ్మదించారు. ఎలాగైతేనేం, ఢిల్లీకి వెళ్ళాక భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై మరింత వేగం పెంచారు. ఢిల్లీ దూతలూ ఈటెల వ్యవహారంపై రాష్ట్ర బీజేపీ నేతలతో చర్చించారు. ఈటెలకు పార్టీలో కల్పించాల్సిన సముచిత స్థానంపై ఓ అవగాహనకి వచ్చిందట తెలంగాణ బీజేపీ. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు తరుణ్ చుగ్ ఈ రోజు బీజేపీ తెలంగాణ నేతలతో మంతనాలు జరిపి, ఆ తర్వాత ఈటెల రాజేందర్ వద్దకు వెళ్ళారు. తరుణ్ చుగ్ వెంట పలువురు బీజేపీ ముఖ్య నేతలు వున్నారు.. వీళ్ళంతా ఈటెల రాజేందర్ వద్దకు వెళ్ళి, ఈటెలతో మాటా మంతీ జరిపారు.
ఈ నెల 14న ఈటెల బీజేపీలో చేరనున్న సంగతి తెలిసిందే. మొత్తమ్మీద, ఈటెలకు బీజేపీలో తగిన గౌరవం దక్కబోతుందన్న నమ్మకం ఇప్పుడు ఈటెల అభిమానుల్లో కలిగింది. ఈటెల వెంట నడవాలనుకున్న కొందరు గులాబీ నేతలు (త్వరలో గులాబీ పార్టీలో వీళ్ళంతా మాజీలు కాబోతున్నారు) ఈ రెండ్రోజుల్లోనే కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారట. మరికొందరు అతి త్వరలో నిర్ణయం తీసుకుంటారన్న ప్రచారమూ జరుగుతోంది. వారిలో కొందరు ఎమ్మెల్యేలు ఓ మంత్రి కూడా వున్నారన్న ప్రచారం గులాబీ వర్గాల్లో కలకలం రేపుతోంది. కాగా, ఈటెల ఢిల్లీకి వెళ్ళొచ్చాక కూడా, ‘ఈటెలకు ప్రత్యేకంగా ఎలాంటి హామీలూ ఇవ్వలేదు..’ అంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఈటెల వర్గాన్ని కొంత కలవరపాటుకు గురిచేసిన విషయం విదితమే. ఆ కలవరపాటుకి నేటితో చెక్ పడ్డట్టయ్యింది.