Employees Protest : అధికార పార్టీని ఇరుకున పెట్టే ఏ వ్యవహారంలో అయినా, విపక్షాలు తమ ఉనికిని చాటుకోవాల్సిందే. రాజకీయాల్లో ‘తక్కెడ’ అట్నుంచి ఇటు మొగ్గు చూపడం అనేది ఆయా రాజకీయ పార్టీలు సందర్భానుసారం స్పందించే తీరుని బట్టి వుంటుంది.
అధికార వైసీపీని ఢీకొట్టడానికి అందివచ్చే ఏ అవకాశాన్నైనా సద్వినియోగం చేసుకోవడానికి రాష్ట్రంలోని విపక్షాలు సిద్ధంగానే వుంటున్నాయి. అయితే, ఎందుకో ఉద్యోగుల సమస్యకు సంబంధించి టీడీపీ అయినా, జనసేన అయినా.. కాస్త చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నట్లే కనిపిస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ సంగతి సరే సరి.
నిజానికి, ఇదొక అద్భుతమైన అవకాశం జనసేన పార్టీకి. ఎందుకంటే, కోవిడ్ కారణంగా నారా లోకేష్, చంద్రబాబు.. హోం ఐసోలేషన్‌లో వున్నారు. సో, జనసేన పార్టీ.. ఈ సమయంలో ఉద్యోగుల పక్షాన నిలబడి పోరాడగలిగితే, ఆ పార్టీకి పొలిటికల్ మైలేజ్ బాగా పెరుగుతుంది. కానీ, ఈ విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగితేనే జనసేనకు ఆ రాజకీయ ప్రయోజనం కలుగుతుంది.
అయితే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆచూకీ రాజకీయ తెరపై కనిపించడంలేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన సినిమాల పనుల్లో బిజీగా వున్నారనే చర్చ జరుగుతోంది. ‘భీమ్లానాయక్’ సినిమా షూటింగ్ ఇంకా కొనసాగుతూనే వున్నట్టుంది. నిజానికి, ఈ సినిమా ఈ సంక్రాంతికే విడుదలవ్వాలి. కొన్ని కారణాలతో సినిమా విడుదల వెనక్కి వెళ్ళింది.
కాగా, కొన్నాళ్ల క్రితం జనసేన అధినేత కోవిడ్ బారిన పడ్డారు.. అదీ సెకెండ్ వేవ్ సమయంలో. కోవిడ్ జనసేనానిని బాగానే ఇబ్బందిపెట్టింది కూడా. అందుకే, ఈసారి ఇంకాస్త అప్రమత్తంగా జనసేనాని వుంటున్నారేమో. అందుకే, ఉద్యోగుల తరఫున నిలబడలేకపోతున్నారేమో.!