ఎలిమినేష‌న్ స‌స్పెన్స్ … అమ్మ రాజశేఖ‌రా లేదంటే మెహ‌బూబా?

బిగ్ బాస్ సీజ‌న్ 4 కార్య‌క్ర‌మం నేటితో సక్సెస్ ఫుల్‌గా ఎనిమిది వారాలు పూర్తి చేసుకుంటుంది. మొత్తం 18 మంది స‌భ్యుల‌తో కొన‌సాగిన ఈ కార్య‌క్ర‌మంలో ఇప్ప‌టివ‌ర‌కు ఏడుగురు ఎలిమినేట్ కాగా, గంగ‌వ్వ‌, నోయ‌ల్ అనారోగ్యంతో నిష్క్ర‌మించారు. ఇక ఈ రోజు ఒక‌రు ఎలిమినేట్ కానుండ‌గా, అది ఎవ‌రు అనే దానిపై అంద‌రిలో ఆతృత నెల‌కొంది. ఈ వారం నామినేష‌న్ విష‌యానికి వ‌స్తే అఖిల్‌, లాస్య, మోనాల్‌, అమ్మ రాజ‌శేఖ‌ర్, అరియానా, మెహ‌బూబ్‌లు డేంజ‌ర్ జోన్‌లో ఉన్నారు. వీరిలో ఒక‌రు నేడు బిగ్ బాస్ గ‌డ‌ప దాట‌నున్నారు.

తాజాగా షోకు సంబంధించిన ప్రోమో విడుద‌ల చేశారు. ఇందులో అమ్మ రాజ‌శేఖ‌ర్, మెహ‌బూబ్ క‌న్ఫెష‌న్ రూంలోకి వ‌చ్చారు. ‘ఒకరు డాన్సర్.. మరొకరు డాన్స్ మాస్టర్. ఒకరు గురువు.. మరొకరు శిష్యుడు.. ఈ ఇద్దరిలో ఎవరు హౌజ్‌కు అవసరం.. ఎవరు అవసరం లేదో మీరే నిర్ణయించుకోండి అంటూ ఇద్ద‌రిలో ఒకరి మెడ‌పై క‌త్తిని పెట్టారు నాగార్జున‌. దీంతో మెహ‌బూబ్ అమ్మ రాజ‌శేఖ‌ర్‌ని ప‌ట్టుకొని తెగ ఏడ్చేశాడు. అంతేకాదు క‌న్ఫెష‌న్ రూం నుండి బ‌య‌ట‌కు వ‌చ్చి సోహైల్‌ని ప‌ట్టుకొని కూడా ఏడ్చేశాడు.

ప్రోమోని బ‌ట్టి చూస్తుంటే అమ్మ రాజ‌శేఖ‌ర్ ఈ వారం ఎలిమినేట్ అయిన‌ట్టు తెలుస్తుంది. ముందు నుండి కూడా అంద‌రు చెబుతున్న మాట ఇదే. కాని ఇక్క‌డ ఓ ట్విస్ట్ కూడా ఉంది. బిగ్ బాస్ ఏ విష‌యాన్ని అంత‌గా ఈజీగా నిర్ణ‌యించే ఛాన్స్ ఇవ్వ‌డు. ప్రోమోని బ‌ట్టి చూస్తే మాస్ట‌ర్ ఎలిమినేట్ అయ్యాడ‌ని తెలుస్తుంది. కాని ఇంత ఈజీ క్లూ బిగ్ బాస్ ఆడియ‌న్స్‌కు ఇస్తాడా అనే సందేహం ఆడియ‌న్స్‌లో క‌లుగుతుంది. ఎలిమినేష‌న్‌లో మాస్ట‌ర్ కాకుండా మెహ‌బూబ్ లేదా మోనాల్ ఉన్నా కూడా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు. దీనిపై పూర్తి క్లారిటీ రావాలంటే కొద్ది నిమిషాలు ఆగ‌క త‌ప్ప‌దు మ‌రి. ఇదిలా ఉంటే టాప్ 5లో ఉంటార‌నుకున్న గంగ‌వ్వ‌, నోయ‌ల్‌లు అనారోగ్యంతో బ‌య‌ట‌కు రావ‌డం వారి అభిమానుల‌కి కొంత బాధ‌ని క‌లిగిస్తుంది.