Election Commission: తమిళనాడులో పూర్తిస్థాయిలో అదుపులోకి వచ్చిన కరోనా వైరస్ అనూహ్యంగా మళ్ళీ విశ్వరూపం ప్రదర్శించడానికి కారణమేంటి.? ఇంకేముంది, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఇదే వాస్తవం. కరోనా సెకెండ్ వేవ్ భయాందోళనలు ఓ పక్క వున్నా, ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.
ఆ మాటకొస్తే, దేశంలో నాలుగు రాష్ట్రాలు ఓ కేంద్ర పాలిత ప్రాంతానికి అసెంబ్లీ ఎన్నికలు జరగడమే కాదు, దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు కూడా జరిగాయి.. తెలంగాణ, ఆంధ్రపదేశ్ రాష్ట్రాలతో సహా. తిరుపతిలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోనూ ఇదే పరిస్థితి. కేరళ, సరికొత్త రికార్డులతో దుమ్ము రేపేస్తోంది కరోనా విషయంలో. తమిళనాడు సంగతి సరే సరి.
ఏకంగా మద్రాస్ హైకోర్టు, తమిళనాడులో కరోనా సెకెండ్ వేవ్ రావడానికి కారణం కేంద్ర ఎన్నికల సంఘం.. అని తేల్చేసింది. కౌంటింగ్ నాటికి పూర్తిస్థాయిలో సరైన ఏర్పాట్లు చేయకపోతే, ఎన్నికల ప్రక్రియను రద్దు చేస్తామని హైకోర్టు వ్యాఖ్యనించడం గమనార్హం. రాజకీయ నాయకుల విచ్చలవిడితనం, ఆయా పార్టీల కార్యకర్తల నిర్లక్ష్యం.. వెరసి దేశాన్ని ప్రమాదంలో పడేశాయి. దేశ ప్రధాని నరేంద్ర మోడీ సైతం, ఎన్నికల ప్రచారంలో బిజీ అయిపోయారు తప్ప, దేశ ప్రజలు ఏమవుతారన్న ఇంగితాన్ని ప్రదర్శించలేదన్న విమర్శలున్నాయి.
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అధికార పార్టీ (టీఎంసీ) అభ్యర్థి ఒకరు కరోనాతో చనిపోవడం గమనార్హం. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే, స్థానిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు కొంతమంది ప్రాణాలు కోల్పోయారు కరోనాతో. గెలిచిన అభ్యర్థుల్లోనూ కొందరు కరోనా బారిన పడి చనిపోయిన సంగతి తెలిసిందే. తిరుపతి సిట్టింగ్ ఎంపీ కూడా కరోనాతో చనిపోవడం వల్లే ఉప ఎన్నిక వచ్చింది. కానీ, రాజకీయ పార్టీలు బాధ్యతను గుర్తెరిగి ప్రవర్తించలేదు.