టీఆర్‌ఎస్‌కు‌ ఝలక్‌ ఇచ్చిన మాజీమంత్రి కుమారుడు.. దుబ్బాక ఎన్నిక దుమ్ము రేపనుందా.. ?

 

అంతా భావించినట్లే అయ్యింది.. దుబ్బాకలో జరుగనున్న ఉప ఎన్నిక పోరు రసవత్తంగా సాగనుందా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు.. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణంతో దుబ్బాకలో ఉప ఎన్నిక ఖాయమైంది. ఇదే సమయంలో అధికార టీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి భగ్గుమన్నది. అయినా గానీ భయపడక ఎలాంటి జంకు లేకుండా సానుభూతి ఓట్లతో ఉప ఎన్నికలో గట్టెక్కవచ్చు అనుకున్న టీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు తలబొప్పి కడుతుంది అని అంటున్నారు.. ఇకపోతే టీఆర్‌ఎస్‌ నుంచి టికెట్‌ ఆశించిన శ్రీనివాస్‌ రెడ్డికి ఆ పార్టీ నుండి అవమానం కలిగిందట.. తన తండ్రికి ఇచ్చిన మాటనే నిలబెట్టుకోలేని ప్రభుత్వం కనీసం తనకు ఇచ్చిన మాటను అయినా నిలబెట్టుకుంటుందని ఆశించారు కానీ ఊహించని విధంగా దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సతీమణికే టికెట్‌ ఇచ్చేందుకే మొగ్గుచూపుతోందని తెలియడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది..

ఇక దుబ్బాక ఉపఎన్నిక షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసినప్పటి నుండి ఎవరు బరిలోకి దిగుతారనే ఉత్కంఠ ప్రజల్లో నెలకొంది.. దానికి తెరదించుతూ ఈ నిర్ణయం వెలువడింది.. అయితే దుబ్బాకతో పాటు దేశవ్యాప్తంగా 54 అసెంబ్లీ నియోజవకర్గాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. కాగా నవంబర్ 3న పోలింగ్ నిర్వహించి, నవంబర్ 10న ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు. ఇప్పటికే ఎన్నికల బరిలోకి దిగేందుకు ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ సిద్ధమయ్యాయి. అభ్యర్థుల వేటలో నేతలు నిమగ్నమయ్యారు.

మరోవైపు ప్రచారం హోరెత్తుతోంది. తాజాగా షెడ్యూల్ రావడంతో మరింత దూకుడు పెంచారు. ఇక బీజేపీ హైకమాండ్ పేరును ఖరారు చేయకముందే రఘునందన్ రావు ప్రచారంలో మునిగిపోయారు. కాంగ్రెస్ తరఫున నలుగురైదుగురు నేతల పేర్లు వినిపిస్తున్నాయి. ఫైర్ బ్రాండ్ విజయశాంతి పేరు కూడా వినిపిస్తోంది. ఈ నేపధ్యంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా శ్రీనివాస్‌రెడ్డి బరిలో నిలిచే అవకాశం ఉందనే వార్త ప్రచారం జరుగుతుంది.. మరి చూడాలి ఈ పోరులో నిలబడి విజయం సాధించేది ఎవరని..