ఆంధ్రప్రదేశ్ లో ఖాళీ అయిన శాసనమండలి సభ్యత్వ స్థానానికి జరగనున్న ఎన్నికల్లో భాగంగా వైకాపా అధిష్టానం బుధవారం తమ అభ్యర్ధిని ఖరారు చేసింది. అందరూ ఊహించినట్లుగానే మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ని వైకాపా తమ అభ్యర్ధిగా ప్రకటించింది. నేడు నామినేషనకు చివరి రోజు కావడంతో మధ్యాహ్నం 12 గంటలకు నామినేషన్ వేయనున్నారు. టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆయన రాష్ర్టంలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఆ పార్టీకి గుడ్ బై చెప్పి, ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసారు. అయితే ఆయన రాజీనామా చేసిన పదవికే మళ్లీ ఆయనే నామినేషన్ వేయడం విశేషం.
ప్రస్తుతం ఖాళీ అయిన స్థానానికి సంబంధించి జరుగుతున్న శాసన మండలి ఎన్నిక శాసన సభ్యుల కోటా నుంచి కావడంతో ఆయన ఎన్నిక దాదాపు లాంఛనమే. ఇటీవలే రాజ్యసభ ఎన్నికలు ముగియడం, జులై 6న శాసనమండలికి ఉప ఎన్నిక జరుగుతోన్న నేపథ్యంలో అందరి దృష్టి మండలి ఎన్నికపైనే పడింది. వాస్తవానికి ఈ స్థానాన్ని గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు పార్టీ జిల్లా అధ్యక్షులు మర్రి రాజశేఖర్ ఆశించారు. కొందరు వైకాపా పెద్దలు ఆయన పేరును రిఫర్ చేయడం జరిగింది. దీంతో ఆయన్ని అభ్యర్ధిగా ఖరారు చేసే అవకాశం ఉందని జోరుగా ప్రచారం సాగింది. కానీ డొక్కా ఇక్కడ జగన్ బలం చూసి టీడీపీ నుంచి బయటకు వచ్చేసారు.
డొక్కా టీడీపీకి రాజీనామా చేసి రావడం ఒక్క ఎత్తైతే..ఇంకా నాలుగు సంవత్సరాల పదవిలో కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ వదులుకుని మరీ వైకాపా కండువా కప్పుకున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే సీఎం జగన్ ఎమ్మెల్సీ టిక్కెట్ ను మళ్లీ డొక్కాకి కేటాయించినట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అండ్ కోకి ఇది మింగుడు పడని వార్తే. తమ పార్టీ నుంచి గెలిచి.. నాలుగేళ్లు పదవి కాలం ఉండగా కూడా జగన్ పంచన చేరడంతో డొక్కా పై ఆ పార్టీ నేతలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఇటీవలే చంద్రబాబు పార్టీని వదిలి వాళ్లందర్నీ ద్రోహులుగా వర్ణించిన సంగతి తెలిసిందే.