ఇది దిల్ రాజు దండయాత్ర

Dil Raju to remake another telugu movie in Hindi
Dil Raju to remake another telugu movie in Hindi
 
బాలీవుడ్ ఇండస్ట్రీ దక్షిణాది సినిమాల మీద గట్టిగా దృష్టి పెట్టింది. ఇక్కడ హిట్ అవుతున్న సినిమాలను హిందీలోకి రీమేక్ చేయడానిక అక్కడి హీరోలు బాగా ఆసక్తి చూపుతున్నారు. అందుకే తెలుగు నిర్మాతలు తెలుగు సినిమాలను హిందీలోకి రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ విషయంలో ముందు ఉన్నారు. తెలుగులో ఇటీవల మంచి విజయాలను సాధించిన సినిమాల రీమేక్ హక్కులను కొనుగోలుచేసి బాలీవుడ్లో పెద్ద హీరోలతో రీమేక్ చేస్తున్నారు. నాని నటించిన ‘జెర్సీ’ సినిమాను షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. దీనికి కూడ ఒరిజినల్ వెర్షన్ డైరెక్ట్ చేసిన గౌతమ్ తిన్ననూరి దర్శకుడు.  
 
అలాగే విశ్వక్ సేన్ నటించిన ‘హిట్’ సినిమాను సైతం దిల్ రాజు హిందీలోకి రీమేక్ చేస్తున్నారు. ఈ రెండూ కాకుండా ఇటీవల నరేష్ నటించిన ‘నాంది’ చిత్రాన్ని కూడ దిల్ రాజు హిందీలో రూపొందించనున్నారు. బాలీవుడ్ అగ్రహీరో అజయ్ దేవగన్, దిల్ రాజుతో కలిసి ఈ రీమేక్ నిర్మాణంలో పాలుపంచుకోనున్నారు. ఇందులో హీరోగా ఎవరు చేస్తారు, దర్శకత్వం ఎవరు వహిస్తారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది.  ఈ మూడు రీమేక్ సినిమాలను కూడ సేఫ్ బడ్జెట్లోనే నిర్మించనున్నారు దిల్ రాజు.  తప్పకుండా వీటి మీద ఆయన మంచి లాభాలనే ఆర్జించనున్నారు. వీటితో దిల్ రాజు పేరు బాలీవుడ్లోనూ స్థిరపడిపోతుంది. ఒకరకంగా చెప్పాలంటే దిల్ రాజు తెలుగు కథలతో బాలీవుడ్ మీద దండయాత్ర చేస్తున్నారనే అనాలి.