Dil Raju: ఇటీవల తెలంగాణలో గద్దర్ అవార్డుల వేడుక ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ వేడుకను ఎఫ్డిసి చైర్మన్గా దిల్ రాజు ముందు ఉండి నడిపించిన విషయం తెలిసిందే. 2024 సంవత్సరం సినిమాలతో పాటు గత పదివేలలో ప్రతి సంవత్సరం వచ్చిన సినిమాలలో మూడేసి సినిమాలకు బెస్ట్ అవార్డులను ప్రకటిస్తూ అవార్డులను కూడా అందజేశారు. అయితే దిల్ రాజు తనకు కావాల్సిన వాళ్లకు, తన సినిమాలకు, తాను డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమాలకు అవార్డులు ఇచ్చుకున్నారు. కొన్ని మంచి సినిమాలను పక్కన పెట్టేసారు. అలాగే అందర్నీ ఈవెంట్ కి పిలవలేదు అని పలువురు కామెంట్స్ చేసారు.
అలాగే సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ సిప్లిగంజ్ తెలంగాణ బిడ్డ హైదరాబాద్ గల్లీల నుంచి ఆస్కార్ దాకా వెళ్ళాడు. అతనికి ఏం అవార్డు ఇవ్వలేదు, ఇవ్వండి అని అవార్డుల వేడుకలో స్టేజిపైనే చెప్పారు. తాజాగా దిల్ రాజు ఈ విషయాలపై స్పందించారు. తమ్ముడు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దిల్ రాజు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. నేను అందర్నీ పిలిచాను. ఇన్విటేషన్ కార్డ్స్ ప్రింట్ లేట్ గా అయింది. దాని వల్ల కొంతమందికి మిస్ అయిందేమో. అయినా నేను FDC చైర్మన్ గా పైపైనే ఉంటాను. MD, ED లు ఉంటారు వాళ్ళు చూసుకుంటారు మెయిన్. వాళ్ళు నాకు ఒక లిస్ట్ తెచ్చి వీళ్ళని పిలుస్తున్నాం అంటే నేను ఓకే చెప్పాను అని అన్నారు దిల్ రాజు. అలాగే అవార్డులపై వచ్చిన ఆరోపణలపై స్పందిస్తూ.. నేను, గవర్నమెంట్ ఎవరూ అవార్డుల్లో ఇన్వాల్వ్ అవ్వలేదు. జ్యురి ఏది ఇస్తే అదే ఫైనల్ చేసాము.
జ్యురి ఇచ్చిన లిస్ట్ నేను రేవంత్ రెడ్డి గారి ముందు పెట్టాను. ఆయన ఓకే అన్నారు. అంతేకాని నా సినిమాలకు అని నేనేమి అవార్డులు ఇచ్చుకోలేదు. అలా జరగదు కూడా. ఒకవేళ జరిగితే నాని దసరా సినిమా నేనే డిస్ట్రిబ్యూషన్ చేశాను కదా, అది తెలంగాణ సినిమా పైగా మరి దానికి ఎందుకు ఇవ్వలేదు అవార్డు. సీఎం గారు పాత సంవత్సరాలకు ఒకటే అవార్డు ఇస్తామని అన్నారు. జ్యురి వాళ్ళే అన్ని సినిమాలు చూసి ఒకటే అంటే కష్టం, కనీసం మూడు సినిమాలు ఇద్దాం అంటే నేను సీఎం, డిప్యూటీ సీఎం తో మాట్లాడి ఒకే చేపించాను అని తెలిపారు. ఇక సీఎం రాహుల్ సిప్లిగంజ్ కి అవార్డు అడిగారు అనే దానిపై స్పందిస్తూ.. సీఎం గారు చెప్పారని అవార్డు ఎలా ఇస్తాం. ఆయన ఏదో ఫ్లోలో మాట్లాడారు. సీఎం అడిగారని ఇవ్వలేం కదా. జ్యురి ఫైనల్ చేసిందే ఫైనల్ అని అన్నారు దిల్ రాజు. దీంతో దిల్ రాజు వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.