ఎంత పెద్ద ప్రొడక్షన్ సంస్థ అయినా ఒకసారి ఒక పాన్ ఇండియా సినిమానే నిర్మించగలదు. ఆ సినిమా పూర్తై లాభమో నష్టమో తెలిశాక రెండవ సినిమాను చెయ్యాలా వద్దా అనేది డిసైడ్ చేస్తారు. కానీ దిల్ రాజు మాత్రం అలా కాదు. ఒక పాన్ ఇండియా సినిమా మొదలయ్యేలోపే ఇంకొక సినిమాను ఫైనాన్ల్ చేసుకున్నారు. ప్రజెంట్ ఆయన రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్రకటించారు. శంకర్ సినిమా అంటే బడ్జెట్ ఏ స్థాయిలో ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. అందునా ‘ఆర్ఆర్ఆర్’ తరవాత చరణ్ చేస్తున్న సినిమా. కాబట్టి బడ్జెట్ 300 కోట్ల వరకు ఉంటుందని అంటున్నారు.
ఈ సినిమా మొదలయ్యే దశలో ఉండగానే ప్రభాస్ హీరోగా ఇంకొక భారీ పాన్ ఇండియా సినిమా అంటున్నారు ఆయన. ఈసారి ప్రశాంత్ నీల్ డైరెక్షన్. ప్రజెంట్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కలిసి ‘సలార్’ చేస్తున్నారు. ఈ సినిమా వేరే లెవల్లో ఉండబోతోంది. మళ్ళీ వీరిద్దరూ కలిసి సినిమా చేయడం అంటే ‘సలార్’ కంటే పెద్ద స్థాయిలోనే ఉంటుంది. మరి ఇలా బ్యాక్ టూ బ్యాక్ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న దిల్ రాజును చూస్తుంటే ఆయన దగ్గర అంత డబ్బుందా అనే ఆశ్చర్యం కలుగక మానదు.