Shirish Reddy: చెర్రీ ఫ్యాన్స్ కి లేఖ రాసిన దిల్ రాజు సోదరుడు.. క్షమించండి అంటూ!

Shirish Reddy: శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన చిత్రం గేమ్ చేంజర్. శ్రీ వెంకటేశ్వర బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించిన విషయం తెలిసిందే. కాగా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది. కాగా గేమ్ ఛేంజర్ విడుదల అయ్యి దాదాపుగా ఆరు నెలలు కావస్తోంది. అయినా కూడా ఇప్పటికీ ఈ మూవీ వార్తల్లో నిలుస్తోంది. తరచూ ఎవరో ఒకరూ ఈ సినిమాపై మాట్లాడి వార్తల్లో నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా దిల్ రాజు సోదరుడు గేమ్ ఛేంజర్ మూవీ రిజల్ట్ స్పందించారు.

నితిన్ హీరోగా నటించిన తమ్ముడు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడిన మాటలు వైరల్ గా మారిన విషయం తెలిసిందే. గేమ్ ఛేంజర్‌ సినిమా తర్వాత రామ్ చరణ్‌ కానీ, డైరెక్టర్ శంకర్‌ కానీ కనీసం తమకు ఫోన్ కూడా చేయలేదని అనడంతో ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే రేపిన విషయం తెలిసిందే. ఇవి సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీశాయి. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ శిరీష్ రెడ్డిపై భగ్గుమంటున్నారు. కొందరు ఆయనపై ట్రోల్స్ కూడా చేసారు. అయితే ఇప్పుడు స్వయంగా శిరీష్ రెడ్డి తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.

ఈ మేరకు ఆయన ఒక లేఖను కూడా విడుదల చేశారు. ఆ లేఖలో ఈ విధంగా రాసుకొచ్చారు. అందరికీ నమస్కారం.. నేను ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలను సోషల్ మీడియా ద్వారా అపార్థాలకు దారి తీసి.. దాని వలన కొందరు మెగా అభిమానులు బాధపడినట్లు తెలిసింది. గేమ్ ఛేంజర్ సినిమా కోసం మాకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన పూర్తి సమయం, సహకారం అందించారు. చిరంజీవి కుటుంబానికి మాకు ఎన్నో ఏళ్ల నుంచి సాన్నిహిత్యం ఉంది. మేము చిరంజీవి, రామ్ చరణ్, అలాగే మెగా హీరోల ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా మాట్లాడం. ఒకవేళ నా మాటలు ఎవరి మనోభావాలను అయినా ఇబ్బంది పెట్టే విధంగా ఉంటే క్షమించండి.అని సోషల్ మీడియా వేదికగా శిరీష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా దిల్ రాజు చేసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.