Devineni Uma:మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఏపీ సీఐడీ యెదుట ప్రత్యక్షమయ్యారు. హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తూ విచారణకు హాజరైనట్లు దేవినేని ఉమ చెప్పుకొచ్చారు. తాను తప్పు చేయలేదనీ, తప్పుడు కేసులు పెట్టి తనను రాష్ట్ర ప్రభుత్వం వేధిస్తోందని దేవినేని ఉమ ఆవేదన వ్యక్తం చేశారు. జైల్లో పెట్టినా, తాను ప్రశ్నిస్తూనే వుంటానన్నారు. కరోనా సమయంలోనూ విచారణకు హాజరు కావాల్సి రావడం బాధగా వుందని అన్నారాయన.
తనపై ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసుల విషయమై న్యాయపోరాటం చేస్తానని చెప్పారు దేవినేని ఉమ. అంతా బాగానే వుందిగానీ, ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసినప్పుడే, ఆయన విచారణకు హాజరయి వుండాల్సింది. హత్య కేసు అయితే కాదు కదా.. మరెందుకు దేవినేని ఉమ, విచారణకు డుమ్మా కొట్టారు.? తప్పించుకు తిరిగారు.? ఈ ప్రశ్నలకు దేవినేని ఉమ, గతంలోనే కుంటి సాకు చెప్పారు.. కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం వల్లనే విచారణకు హాజరు కాలేకపోయినట్లు సెలవిచ్చారు.
ఇదిలా వుంటే, టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్రకు హైకోర్టులో చుక్కెదురైంది. తన రిమాండ్ విషయమై హైకోర్టును ఆయన ఆశ్రయించగా, ఆ పిటిషన్ ని హైకోర్టు కొట్టివేసింది. కేసుపై పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఏసీబీని ఆదేశించిన న్యాయస్థానం, తదుపరి విచారణను మే 5వ తేదీకి వాయిదా వేసింది. సంగం డెయిరీ కేసులో ధూళిపాళ్ళ నరేంద్రను ఏసీబీ ఇటీవల అరెస్ట్ చేసిన విషయం విదితమే.
రాష్ట్రంలో టీడీపీ నేతలే లక్ష్యంగా అక్రమ కేసుల్ని ఏపీ సీఐడీ, ఏపీ ఏసీబీ బనాయిస్తోందని టీడీపీ విమర్శిస్తుండగా, అక్రమార్కులపై చర్యలు తీసుకుంటున్నామనీ, ఇందులో రాజకీయ కక్ష ఏమీ లేదని అధికార పక్షం చెబుతోంది. ఏదిఏమైనా కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో ఈ తరహా రాజకీయ వివాదాలు.. కొత్త అనుమానాలకు తెరలేపుతున్నాయన్నది నిర్వివాదాంశం.