అల్లు అర్జున్ ‘పుష్ప’తో రిస్క్ చేసేస్తున్నాడుగానీ..

అన్నీ బాగుంటే, ఈ పాటికే రిలీజ్ కావల్సిన ‘పుష్ప’ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు క్రిస్మస్‌ని బెస్ట్ ఆప్షన్‌గా ఎంచుకుంది. అయితే, సడెన్‌గా డేట్ మార్చేసి, క్రిస్మస్ కన్నా ముందే అంటే, డిశంబర్ 17 న ‘పుష్ప’ రిలీజ్ కాబోతోందంటూ, అల్లు అర్జున్ టీమ్ సర్‌ప్ర‌ైజ్ ఇచ్చింది. అనుకున్న డేట్ కన్నా కొద్ది రోజులు ముందే వస్తున్నాడంటే, బన్నీ అభిమానులు సంబరపడిపోయిన మాట వాస్తవమే. కానీ, అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది.

డిశంబర్ నెలను ‘డ్రై మంత్’ గా వ్యవహరిస్తుంటారు సినీ జనం. నాగార్జునకు తప్ప ఆ సీజన్‌ ఇంతవరకూ ఎవ్వరికీ కలిసొచ్చింది లేదు. అప్పుడప్పుడు నాగార్జున కూడా దెబ్బ తిన్న సందర్భాలున్నాయి. కానీ, కరోనా కాలం. వేరే దారి లేని పరిస్థితి. గత ఏడాది కరోనా వేవ్ తగ్గిందనుకున్నతరుణంలో మెగా హీరో సాయి తేజ్ ‘సోలో బతుకే సో బెటర్’ సినిమా రిలీజైంది. ఈ సినిమాతోనే గతేడాది సినిమాల రిలీజ్‌లు మొదలయ్యాయి కానీ, ఆ ముచ్చట ఎన్నాళ్లో నిలవలేదు. తెలిసిన సంగతే.

ఈ ఏడాది విషయానికి వస్తే, ధియేటర్లలో సినిమాల సందడి ఆల్రెడీ మొదలైంది. ‘సీటీమార్’ తదితర సినిమాలు రిలీజయ్యాయి. కానీ, అవేమీ కుదేలైన ఇండస్ర్టీని బాగు చేయలేకపోయాయి. రీసెంట్‌గా ‘లవ్ స్టోరీ’ సినిమాతో కాస్త ఊపొచ్చినా, ఇది చాలదు. ఇకపోతే, దసరాకి కూడా పెద్ద సినిమాలేమీ రిలీజ్‌ బరిలో లేవు.

ఈ టైమ్‌లో రిస్క్ చేసి డిశంబర్‌లో రిలీజ్‌కి రెడీ అవుతున్న బన్నీ, పరిశ్రమకు ఊపందిస్తాడా.? లేక డీలా పడతాడా.? ‘పర్లేదు’ అనే కాన్పిడెన్స్ బన్నీ సినిమాతోనే రావాల్సి ఉంది తెలుగు సినీ పరిశ్రమకి. మరి ఆ కాన్ఫిడెన్స్ ఇస్తే ఫర్వాలేదు. కానీ, ఒకవేళ ఢీలా పడితే మాత్రం సంక్రాంతి రిలీజ్‌లు కూడా డైలమాలో పడ్డట్లే. చూడాలి ఏం జరుగుతుందో.