దుబ్బాక ఉప ఎన్నికను ప్రతి పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అందుకే దుబ్బాక ఉప ఎన్నికలో గెలుపు కోసం పార్టీలన్నీ తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా దుబ్బాకలో పోటీ అంటే టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ఉంది. టీఆర్ఎస్ పార్టీ.. అధికార పార్టీ. మునుపటి ఎమ్మెల్యే కూడా టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేనే. అలాంటి పరిస్థితుల్లో మళ్లీ టీఆర్ఎస్ పార్టీ గెలవకపోతే పార్టీ పరువు గంగలో కలవడం ఖాయం అని అనుకున్న సీఎం కేసీఆర్.. వెంటనే దుబ్బాకకు ట్రబుల్ షూటర్ హరీశ్ రావును రంగంలోకి దించారు.
మరోవైపు బీజేపీ కూడా దూకుడు మీదున్నది. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా దుబ్బాకలోనే మకాం వేశారు. తమ పార్టీ ముఖ్య నేత అయిన రఘునందన్ రావును గెలిపించడం కోసం సంజయ్ కూడా శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు కూడా దుబ్బాకలోనే మకాం వేశారు.
అయితే.. దుబ్బాకలో సోమవారం సాయంత్రం ఓ సంఘటన జరిగింది. అదే ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది.
బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బంధువుల ఇంట్లో డబ్బులు ఉన్నాయని.. ఓటర్లను పంచడం కోసం తీసుకొచ్చారని పోలీసులకు తెలిసింది. దీంతో పోలీసులు వెంటనే రఘునందన్ రావు బంధువు ఇంటికి వెళ్లినట్టు తెలుస్తోంది. అక్కడ సోదాలు నిర్వహించగా.. పోలీసులకు సుమారు 20 లక్షల రూపాయల నగదు లభించిందని సమాచారం.
అయితే.. రఘునందన్ రావు బంధువు ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారని తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు అక్కడికి చేరుకొని పోలీసులను అడ్డుకున్నారు. అప్పటికే ఓ పోలీస్ కానిస్టేబుల్.. డబ్బులు ఉన్న సంచిని తీసుకొని ఇంట్లోనుంచి బయటికి రాగా.. బీజేపీ కార్యకర్తలు మాత్రం.. పోలీసులే డబ్బులు తీసుకొచ్చారంటూ ఆందోళన నిర్వహించారు.
డబ్బుల కట్టలను చూసి.. పోలీసుల నుంచి డబ్బుల కట్టలను గుంజుకొని బయట అందరికీ చూపిస్తూ బీజేపీ కార్యకర్తలు అక్కడ తెగ హడావుడి చేశారు. పోలీసులు ఎంత వారించినా వినకుండా.. పోలీసులే డబ్బులు తీసుకొచ్చారంటూ పోలీసులపై విరుచుకుపడ్డారు.
ఈ ఘటనలో పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.