బాల‌య్య అభిమానుల‌కు గుడ్ న్యూస్.. శివ‌రాత్రి రోజు స‌ర్‌ప్రైజ్ చేయ‌నున్న బీబీ3 టీం

నంద‌మూరి బాల‌కృష్ణ ఇప్ప‌టికీ వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషిస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తూ వ‌స్తున్నారు. కుర్ర హీరోల‌కు పోటీగా వ‌రుస సినిమాలు చేస్తున్న బాల‌య్య త‌న‌కు సింహ, లెజెండ్ వంటి భారీ హిట్స్ ఇచ్చిన బోయ‌పాటి శ్రీనివాస్ ద‌ర్శ‌కత్వంలో మాస్ ఓరియెంటెడ్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా బీబీ 3 అనే టైటిల్‌తో కొద్ది రోజులుగా ప్ర‌చారం జ‌రుపుకుంటుంది. ఇందులో బాల‌కృష్ణ అఘోరా పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ని, త‌న పాత్ర‌తో ప్రేక్ష‌కుల‌కు ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందించ‌డం ఖాయంగా తెలుస్తుంది.

బాల‌కృష్ణ‌- బోయ‌పాటి శీను మూవీకి సంబంధించిన అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురు చూస్తుండ‌గా, రీసెంట్‌గా ఈ చిత్రాన్ని మే 28న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. దీంతో అంద‌రి దృష్టి ఆ డేట్‌పై ఉంది. అయితే మూవీ టైటిల్ ఏంటా అని కొద్ది రోజులుగా అంద‌రిలో చ‌ర్చ న‌డుస్తుండ‌గా, తాజాగా ఇందుకు సంబంధించిన ఓ అప్‌డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ క్రేజీ సినిమాకు ‘మోనార్క్’ అనే టైటిల్‌నే ఫైనల్ చేశారని, ఈ టైటిల్‌ను మహా శివరాత్రి సందర్భంగా మార్చి 11న ప్రకటించనున్నారని తెలుస్తోంది.

బోయ‌పాటి- బాల‌కృష్ణ సినిమా అంటేనే ఓ రేంజ్ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉంటాయి. అలాంటిది ఈ చిత్రంలో బాల‌య్య అఘోరాగా క‌నిపించ‌నున్నాడు అనే స‌రికి అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది. ఆ మ‌ధ్య ఈ మూవీ నుంచి విడుదల చేసిన ‘బీబీ3 ఫస్ట్ రోర్’ నందమూరి అభిమానులను హుషారెత్తించింది. బాల‌య్య మాస్ డైలాగ్‌కు ఫ్యాన్స్ పూన‌కం వ‌చ్చిన‌ట్టు ఊగిపోయారు. సినిమా కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. మిర్యాల స‌త్య‌నారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో ఈ మూవీ రూపొందుతోంది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకోవ‌ల‌సిన ఈ చిత్రం క‌రోనా వ‌ల‌న వాయిదా ప‌డింది.