రాజకీయ నాయకులకు ఎప్పుడు ఏ టాపిక్ మీద మనసు మళ్లుతుందో చెప్పలేం. ఒకసారి స్వచ్ఛంగా రాజకీయాల గురించే మాట్లాడే నాయకులు ఒక్కోసారి రాజకీయాలతో సంబంధం లేని విషయాలను కూడ లేవనెత్తుతుంటారు. వీరికి ఎక్కువగా టార్గెట్ అయ్యేది సినిమా పరిశ్రమే. ఇప్పుడంటే కొద్దిగా తగ్గింది కానీ ఇంతకుముందు రాజకీయ నాయకీలు సినిమా వాళ్ళ మీద తరచూ విమర్శలకు దిగేవారు. టీవీ డిబేట్లలో కూర్చుని మరీ నటీనటులను, దర్శకులను చెండాడేసిన సందర్భాలు అనేకం. పలనా సినిమాలో హీరోయిన్ ను ఆడవారు అవమానపడే రీతిలో చూపించారు, ఆ దర్శకుడు కులం పేరుతో కామెడీ చేశాడు, పలనా హీరో బూతు డైలాగులు చెప్పాడు అంటూ సినిమా టైటిల్ మొదలుకుని పాత్రల మాటల వరకు నానా హంగామా చేశారు.
తాజాగా సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నటుడు నాగార్జునపై ఒంటికాలు మీద లేచారు. ఇటీవల నాగార్జున బిగ్ బాస్ తెలుగు సీజన్ 4కు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఆ షో మంచి టీఆర్ఫీలు సాధించింది. జనం కూడ షోను బాగా ఎంజాయ్ చేశారు. కానీ నారాయణకు మాత్రం షో నచ్చలేదు. షో అనడం కంటే వ్యాఖ్యాత నాగార్జున మాట్లాడిన మాటలు నచ్చలేదనడం కరెక్టేమో. నాకు అక్కినేని నాగార్జున అంటే చాలా అభిమానం అంటూ మొదలుపెట్టిన నారాయణ ఆయన సినిమాలు చూస్తుంటాను. కానీ ఆయన బిగ్‌బాస్ షోతో ఆయన దరిద్రపు పనులు చేశారు. బిగ్‌బాస్‌లో ముగ్గురు యువతుల ఫోటోలు పెట్టి ఒక యువకుడిని ఎవర్ని కిస్ చేస్తావు ? ఎవరితో డేటింగ్ చేస్తావు ? ఎవరిని పెళ్ళి చేసుకుంటావు ? అని ఓపెన్‌గా అడిగారు. అలా ఓపెన్‌గా మాట్లాడటం ఎంత అవమానకరం. ఆ ఫోటోల్లో ఆయన ఇంట్లోని మహిళా నటుల ఫోటోలు పెట్టి అడగ్గలడా. పద్ధతిగా ఉన్న నాగార్జున ఎందుకిలా చేస్తున్నాడు అంటూ డిసప్పాయింట్ అయ్యారు.
అంతేకాదు ఈ విషయం మీద కేసు వేయడానికి కోర్టుకు వెళితే కింది కోర్టులు కేసును తీసుకోలేదు. త్వరలోనే ఈ షోపై హైకోర్టులో కేసు వేస్తాను. ఎంత వరకైనా పోరాడుతాను. నాగార్జున ఈ సమాజానికి క్షమాపణ చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు. అసలు నారాయణ లాంటి సీనియర్ నేత ఒక టీవీ షో గురించి ఇంత చింతపోవడం చిత్రంగానే ఉంది. అమరావతి, పోలవరం, రాష్ట్రం అప్పులు, అభివృద్ధి లేమి అంటూ సవాలక్ష ప్రజాసమ్యలు ఉండగా ఆయనకు బిగ్ బాస్ షోలో నాగార్జున మాటలే పెద్దవనిపించడం ఏంటో మరి. రియాలిటీ షో అంటేనే అంతా ఓపెన్. అప్పుడే చూసే జనానికి ఎంటర్టైన్మెంట్. అదే ఛానెల్ వారి వ్యాపార సూత్రం. వారెలా చెబితే వ్యాఖ్యాత అలా యాంకరింగ్ చేయాలి. అక్కడ నాగార్జునే కాదు వేరేవారు ఉన్నా అలాగే చేయిస్తారు. తప్పుబడితే ఛానెల్ యాజమాన్యాన్ని తప్పుబట్టాలి కానీ నాగార్జున దరిద్రపు పనులు చేశారని మండిపడితే ఏం ప్రయోజనం.