Covid19: వైద్యం ఎలాగూ అందివ్వలేకపోతున్నారు.. కనీసం, అంతిమ సంస్కారాలైనా గౌరవప్రదంగా జరిగేలా చూడాల్సిన బాధ్యతను పాలకులు విస్మరిస్తుండడం పట్ల సర్వ్రత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్మశానాల ముందు తమవారి పార్తీవ దేహాలతో క్యూ కట్టాల్సిన పరిస్థితి వస్తే, బాధిత కుటుంబాల ఆవేదన ఎంత భయానకమో కదా.? దేశ రాజధాని ఢిల్లీ, దేశ ఆర్థిక రాజధాని ముంబై.. ఇలా చెప్పుకుంటే, దేశంలోని చాలా నగరాల్లో ఇదే పరిస్థితి.
మామూలుగానే నగరాల్లో మరుభూమి అంటే కనాకష్టమైన వ్యవహారం. కోవిడ్ 19 తీవ్రత నేపథ్యంలో పరిస్థితి మరింత దుర్భరమైపోయింది. ఆసుపత్రుల్లో పడకలు దొరక్క, బాధితులు ప్రాణాలు కోల్పోతోంటే, తమవారి పార్తీవ దేహాల్ని ఎలా ఎక్కడికి తీసుకెళ్ళి అంత్యక్రియలు చేయాలో బాధిత కుటుంబాలకు అర్థం కావడంలేదు. కడసారి చూపు అనేది కూడా దక్కని రోజులివి. అనాధ శవాల్లా, చాలా పార్తీవ దేహాల్ని గుంపులుగా దహనం చేసేసిన దుస్థితి కళ్ళ ముందు కనిపిస్తోంది. ‘అబ్బే, పరిస్థితి మరీ అంత దారుణంగా లేదు. దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం..’ అని హెచ్చరిస్తున్న పాలకులకు, కింది స్థాయిలో ఏం జరుగుతుందో తెలియదా.? తెలిసీ, మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారా.?
రాజకీయంగా, సామాజికంగా ఉన్నత స్థానంలో వున్నవారి పరిస్థితీ దయనీయంగానే వుంది. సామాన్యుడితో పోల్చితే, వాళ్ళ పరిస్థితి కాస్త బెటర్.. అంతే. ఇంతటి దారుణమైన పరిస్థితుల్లో వున్న దేశం, సమీప భవిష్యత్తులో కోలుకుంటుందా.? అన్న భయం సామాన్యుల్లో కలగడం సఝమే కదా. బైక్ మీద పార్తీవ దేహాన్ని తరలించాల్సి రావడమంటేనే, దేశంలో పాలకులు పూర్తిస్థాయిలో విఫలమైనట్టు లెక్క.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఈ వైఫల్యానికి నైతిక బాధ్యత వహించాల్సిందే. విదేశాల నుంచి ఆక్సిజన్ తెప్పిస్తున్నాం.. అని ఘనంగా చెప్పుకుంటున్న పాలకులు, అంతిమ సంస్కారాలు గౌరవప్రదంగా జరగడానికి అవసరమైన విద్యుత్ దహన యంత్రాల్నీ దిగుమతి చేసుకుంటే, కొంతవరకైనా బాధిత కుటుంబాలకి ఉపయుక్తంగా వుంటుందేమో. ఇలాంటి స్థితి.. కాదు కాదు దుస్థితి.. పగవాడిక్కూడా రాకూడదంతే.