Covid Second Wave: కరోనా మొదటి వేవ్.. మరీ ఇంత భయానకంగా లేదు. అసలు అప్పట్లో కరోనా గురించి ఎవరికీ పూర్తిగా అవగాహన లేదు. దాంతో, కొంత భయపడ్డారు.. కొంత లైట్ తీసుకున్నారు. లాక్ డౌన్ కొంతవరకు బాగానే పనిచేసింది. అయితే, సడలింపులు, ప్రజల్లో కరోనా పట్ల నిర్లక్ష్యానికి కారణమయ్యాయి. అదృష్టం, మొదటి వేవ్.. అంచనాల కంటే కాస్త తక్కువగానే డ్యామేజ్ చేసింది. అయితే, మొదటి వేవ్ ఆర్థిక విధ్వంసానికి కారణమైంది. జనాల జీవితాలు చితికిపోయాయి.
మొదటి వేవ్ వల్ల వచ్చిన సునామీ నుంచి తేరుకుంటోన్న జనం మీద సెకెండ్ వేవ్ ఇంకా దారుణంగా విరుచుకుపడుతోంది. ఈసారి అవగాహన పెరిగింది.. నిర్లక్ష్యం కూడా పెరిగిపోయింది. మొదటి వేవ్ సందర్భంగా బాధపడినోళ్ళంతా (ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఇతరత్రా విషయాల పరంగా), రెండో వేవ్ సందర్భంగా జాగ్రత్త పడుతున్నారు. కానీ, కొందరి నిర్లక్ష్యం మాత్రం యధాతథంగా కొనసాగుతోంది. సినిమాలు, షికార్లు.. ఇవేవీ ఆగడంలేదు.
నిజానికి, కరోనా వైరస్ మీద విజయం సాధించాలంటే, జనం ఎక్కువగా గుమికూడకూడదు. కానీ, జనం లేకపోతే ఎలా.? బయట తిరగకపోతే ఎలా.? అన్నట్టు అనవసరంగా జనం బయట తిరిగేస్తున్నారు. గత అనుభవాల నేపథ్యంలో ‘కట్టడి’కి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెనుకాడుతున్నాయి. దాన్ని, కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. కొందరి నిర్లక్ష్యం.. ఇప్పుడు అందరికీ శాపంగా మారుతోంది. అత్యంత వేగంగా ఈసారి కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న దరిమిలా, పరిస్థితి రోజురోజుకీ అత్యంత ప్రమాదకరంగా మారుతోంది.
వైద్య చికిత్స కొంతమేర బాగానే అందుబాటులోకి వచ్చినా, ఇప్పటికీ ఏ మందు వేస్తే కరోనా వైరస్ తగ్గుతుందో తెలియని పరిస్థితి. అంటే, మనం మొదటి వేవ్ నుంచి పెద్దగా పాఠాలు నేర్చుకోలేదన్నమాటే కదా. మందు లేదు.. టీకా ఎంతవరకు పనిచేస్తుందో తెలియదు.. అంటే, ఇంకా ఇంకా అత్యంత అప్రమత్తంగా వుండాల్సిందే. ఇంకో రెండేళ్ళు ఇదే పరిస్థితి అని అధ్యయనాలు చెబుతున్న దరిమిలా, నిర్లక్ష్యం ఇకనైనా వీడుదామా.?