Covid Deaths: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కోవిడ్ మరణాల్ని ప్రభుత్వ హత్యలుగా అభివర్ణించారు. అంటే, నిన్న నమోదైన 3 వేలకు పైగా కరోనా మరణాల్ని, మోడీ సర్కార్ చేసిన హత్యలుగా భావించాలా.? కాదు కాదు, ఇక్కడ బండి సంజయ్ ఆరోపణలు తెలంగాణకే పరిమితమట. ఇదెక్కడి చోద్యం.? రాజకీయాలంటేనే అంత.
ఆక్సిజన్ సరఫరా కేంద్రం చేతుల్లో వుంది.. రెమిడిసివిర్ కేటాయింపు కేంద్రం చేతుల్లో వుంది.. వ్యాక్సిన్ల వ్యవహారమూ కేంద్రం చెప్పు చేతల్లోనే నడుస్తోంది. కానీ, రాష్ట్రాలు కరోనా మహమ్మారిని సరిగ్గా కట్టడి చేయడంలేదంటే ఎలా.? పైగా, రాష్ట్రాల మధ్య రాకపోకల్ని నియంత్రించకూడదు. అసలు కేంద్రం ఆలోచనలు ఏంటి.? బీజేపీ నేతలు ఏం మాట్లాడుతున్నారు.? కరోనా సెకెండ్ వేవ్ పట్ల తొలుత అప్రమత్తమవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వమే. ఆ తర్వాత బాధ్యత రాష్ట్రాలది. దే
శ ప్రజలందరికీ వ్యాక్సిన్ వేయించాల్సిన బాధ్యత కేంద్రానిదే. కానీ, కేంద్రం.. తూతూ మంత్రంగా తమ బాధ్యతల్ని నిర్వహిస్తూ మమ అన్పించేస్తోంది. వ్యాక్సిన్ లభ్యత సరిగ్గా లేదు. పోనీ, మహారాష్ట్రలో కరోనా ఉప్పెనలా పోటెత్తుతున్న సమయంలో, ఆ రాష్ట్ర సరిహద్దుల్ని మూసేసిందా.? అంటే అదీ లేదు. మరెలా కరోనా కట్టడి జరుగుతుంది.?
తెలంగాణలో కరోనా మరణాల్ని ప్రభుత్వ హత్యలంటున్నప్పుడు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కరోనా మరణాలకి ఎవరు నైతిక బాధ్యత వహించాలో బండి సంజయ్ చెబితే బావుంటుంది. కేంద్రంతోపాటు, కరోనా కట్టడిలో రాష్ట్రాలకూ బాధ్యత వుంది. కేంద్రం, రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేస్తేనే ప్రజలకు భద్రత, భరోసా లభిస్తాయి. కానీ, దేశ ప్రజలకు ఆ భద్రత, భరోసా కన్పించడంలేదు. కరోనా సంక్షోభంలో కూడా రాజకీయ పార్టీలు రాజకీయాలే చేస్తున్నాయంటే, ఇంతకన్నా దిగజారుడుతనం ఇంకేముంటుంది.?