
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. లక్ష టెస్టులు చేస్తోంటే, కేవలం 3 వేల పాజిటివ్ కేసులు మాత్రమే నమోదవుతున్నాయంటే, తెలంగాణలో కరోనా పూర్తిస్థాయిలో అదుపులోకి వచ్చేస్తున్నట్లే లెక్క. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా కన్పిస్తోంది. టెస్టుల సంఖ్య తగ్గుతోంటే పాజిటివ్ కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తోంది. టెస్టుల సంఖ్య పెరుగుతోంటే, పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. పాజిటివిటీ రేటు కొద్ది రోజుల క్రితంతో పోల్చితే, ఇప్పుడు కాస్త మెరుగ్గా వున్నా.. తెలంగాణతో పోల్చితే చాలా తీవ్రంగానే ఏపీలో పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకిలా.? తెలంగాణలో లాక్ డౌన్ అమలవుతోంది.. ఇంచుమించు అదే స్థాయిలో కర్ఫ్యూ పేరుతో యధాతథంగా ఆంక్షలు ఏపీలోనూ అమలవుతున్నాయి. పెద్ద సమస్య ఏంటంటే, ప్రజలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో. ప్రభుత్వ యంత్రాంగం కూడా చూసీ చూడనట్టు వ్యవహరిస్తుండడంతో కర్ఫ్యూ వేళల్లోనూ చాటుమాటుగా జనం తిరిగేస్తున్నారు.
వివాహాది శుభ కార్యాలు, మతపరమైన కార్యక్రమాల విషయంలో అధికారికంగా కొంతమేర ఆంక్షలున్నా, ఆ ఆంక్షల్ని ఎవరూ పట్టించుకోవడంలేదు. వాటి మీద అధికారుల నిఘా కూడా పెద్దగా కనిపించడంలేదు. ఇదిలా వుంటే, కరోనా మూడో వేవ్ వచ్చినా, ఎదుర్కొనేందుకు సిద్ధంగా వుందని ప్రభుత్వం చెబుతోంది. మొదటి వేవ్ సందర్భంగా కూడా ఇవే మాటలు చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. రెండో వేవ్ కూడా ఆంధ్రపదేశ్ రాష్ట్రాన్ని తీవ్రంగానే ఇబ్బంది పెడుతోంది. మూడో వేవ్ వస్తే పరిస్థితి ఇంకెలా వుంటుందో ఊహించడం కష్టమే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పినట్టు, రాష్ట్రంలో అసలు మెట్రో నగరం అనేదే లేదు. అయినా, ఈ స్థాయిలో కరోనా ఎందుకు ఇంత తీవ్రంగా ప్రభావం చూపుతోందన్నదానిపై ప్రభుత్వ పెద్దలే ఆత్మ విమర్శ చేసుకోవాలి.
