కరోనా దెబ్బ: సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షల రద్దు

CBSE 10th Exams Cancelled
CBSE 10th Exams Cancelled
 
కరోనా వైరస్ దెబ్బకి విద్యా వ్యవస్థ సర్వనాశనమైపోయిందనడానికి తాజా నిదర్శనం.. సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షల రద్దు. ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించిన సమీక్షా సమావేశం తర్వాత, విద్యా శాఖ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 12వ తరగతి పరీక్షల విషయంలో మాత్రం జూన్ 1న తుది నిర్ణయం తీసుకుంటారు. దేశంలో కరోనా తీవ్రత ఎంతలా వుందో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? దేశంలో చాలా విద్యా సంస్థలు, విద్యార్థుల్ని పీల్చి పిప్పి చేస్తున్నాయి.. విద్యార్థుల తల్లిదండ్రుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. విద్యా సంస్థలూ నష్టాల్లో వున్న మాట వాస్తవమే అయినా, ఆ పేరు చెప్పి విద్యార్థుల్నీ, విద్యార్థుల తల్లిదండ్రుల్నీ దోచేస్తే ఎలా.? నిజానికి ఈ పాపం ప్రభుత్వాలదే. తెలుగు రాష్ట్రాలు ఈ విషయంలో తక్కువేం తిన్లేదు. పరిస్థితి తీవ్రంగా వున్నా, తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నాయి.
 
తెలంగాణలో విద్యా సంస్థలు మూతపడగా, ఆంధ్రపదేశ్ ప్రభుత్వం పూర్తి బాధ్యతారాహిత్యం ప్రదర్శిస్తోంది విద్యార్థుల విషయంలో. అసలంటూ ఈ విద్యా సంవత్సరంలో సరిగ్గా విద్యా సంస్థలు నడిచిందే లేదు. కానీ, ఫీజుల మోత మాత్రం మోగిపోతోంది విద్యా సంస్థల్లో. ఇప్పుడేమో పరీక్షల సమయంలో కరోనా సెకెండ్ వేవ్ భయపెడుతోంది. తెలంగాణ కాస్త జాగ్రత్త పడింది. ఆంధ్రపదేశ్ మాత్రం అదే బాధ్యతారాహిత్యం ప్రదర్శిస్తోంది. ఫలితంగా కరోనా పాజిటివ్ కేసులు అత్యంత వేగంగా పెరుగుతున్నాయి. ఒక్క ప్రాణం పోయినా, దానికి ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి వుంటుంది. విద్యా సంస్థల సంగతి పక్కన పెడితే, ఎన్నికల పేరుతో రాజకీయ పార్టీలు చేస్తున్న పబ్లిసిటీ స్టంట్ల సంతేంటి.? అవి కదా, దేశంలో కరోనా సెకెండ్ వేవ్ ఇంతలా రావడానికి కారణం.?