Covid 19: ‘కరోనా వైరస్ సోకినా పెద్దగా ప్రమాదం లేదు. కోవిడ్ 19 కేవలం స్వల్ప ఇన్ఫెక్షన్ మాత్రమే.. 85 శాతం నుంచి 90 శాతం మంది ప్రజలు జలుబు, జ్వరం, గొంతు నొప్పి, ఒళ్ళు నొప్పులు వంటి లక్షణాలకు మాత్రమే గురవుతారు. చాలా తక్కువమందికి మాత్రమే ఆసుపత్రి అవసరం ఏర్పడుతుంది. అందులోనూ చాలా తక్కువమందికి ఆక్సిజన్, అందులోనూ కొందరికే వెంటిలేటర్ అవసరం ఏర్పడుతుంది..’ అంటున్నారు వైద్య నిపుణులు. పైగా ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా ఈ వ్యాఖ్యలు చేశారు.
అంటే, కరోనా వైరస్ మరీ అంతలా భయపెట్టేదేమీ కాదన్నమాట. మరి, ఎందుకీ దుస్థితి దేశంలో.? ఆక్సిజన్ దొరకడంలేదు, ఆసుపత్రుల్లో పడకలు దొరకట్లేదు.. మందులు కూడా బ్లాక్ మార్కెట్ పరం అవతున్నాయి.. ఇలా ఎందుకు జరుగుతోంది.? అంటే, భయం. ఔను, భయంతోనే చాలామంది ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మందులు కొనుగోలు చేస్తున్నారు. ఆక్సిజన్ సిలెండర్లనూ అవసరం లేకపోయినా వాడేస్తున్నారు.
నిజానికి, ఎయిమ్స్ డైరెక్టర్ గులేరియా చేసిన వ్యాఖ్యలు చాలామందికి గుండె ధైర్యాన్ని కలిగిస్తాయి. అయితే, కరోనా వైరస్ విషయంలో అస్సలేమాత్రం అలసత్వం పనికిరాదు. వైరస్ సోకిందని అనుమానం వస్తే, వెంటనే డాక్టర్లను సంప్రదించాల్సిందే. వైద్య సలహా మేరకు హోం ఐసోలేషన్ అవసరమా.? ఆసుపత్రిలో చేరడమా.? అన్నది తేలుతుంది. నిజానికి, ప్రతిరోజూ కొత్తగా నమోదవుతున్న రికార్డు స్థాయి కేసులే చూస్తున్నాం తప్ప, అదే స్థాయిలో నమోదవుతున్న రికవరీల గురించి పట్టించుకోవడంలేదు మనం.
నిజమే, చాలామందికి కరోనా వైరస్ సోకిందన్న విషయం కూడా తెలియదు. కొంతమందికి స్వల్ప లక్షణాలే కనిపిస్తున్నాయి. భయపడాల్సిన పనిలేదు.. కానీ, భయపడాలి. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, కానీ ఆందోళన తప్పదు. భయం, ఆందోళన.. జాగ్రత్త కోసమే అయితే ఫర్వాలేదు. లేదంటే మాత్రం.. తేడాలొచ్చేస్తాయ్.