Covid 19: దేశంలో కరోనా తీవ్రత నేపథ్యంలో హెల్త్ ఎమర్జన్సీ పెట్టాలనే చర్చ సర్వత్రా జరుగుతోంది. అసలు హెల్త్ ఎమర్జన్సీ అవసరమా.? కాదా.? అన్న విషయమై ఓ ప్రముఖ ఛానల్ ఓ చర్చా కార్యక్రమాన్ని నిర్వహించింది. మాజీ ఐఏఎస్ అధికారి, లోక్ సత్తా వ్యవస్థాపకుడు, మాజీ ఎమ్మెల్యే జయప్రకాష్ నారాయణ, ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. అసలు ఎమర్జన్సీ అనే ప్రస్తావనే అనవసరం అన్నది ఇరువురు ప్రముఖులు తేల్చిన మాట.
హెల్త్ ఎమర్జన్సీ అన్నది వుండదని ఇద్దరూ తేల్చేశారు. దేశంలో ప్రజలందరికీ సరిపడా ఆక్సిజన్ ఉత్పత్తి చేసే అవకాశం వుందనీ, అత్యవసరమైతే మొత్తంగా పారిశ్రామిక వినియోగం మానేసి, ఆక్సిజన్ అందరికీ అందించవచ్చనీ జేపీ అంటున్నారు. అవసరమైన మందులు అందుబాటులోనే వున్నాయనీ, ఆసుపత్రుల్లో చికిత్స పొందాల్సిన వ్యక్తుల శాతం కరోనా విషయంలో చాలా తక్కువగా వుంది గనుక, సరైన ప్లానింగ్ వుంటే ప్రభుత్వాలకు కరోనా పాండమిక్ డీలింగ్ అనేది పెద్ద కష్టమేమీ కాదనీ, ప్రజలు కూడా అపోహలు వీడి, అవగాహన పెంచుకోవాల్సి వుందనీ జేపీ అభిప్రాయపడ్డారు.
మరోపక్క, బాధ్యతగా వ్యవహరించాల్సిన పాలకులు, బాధ్యతా రాహిత్యంతో వ్యవహరించడం వల్లే ఈ దుస్థితి అని ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పుకొచ్చారు. కరోనాపై విజయం సాధించిన నరేంద్ర మోడీ.. అంటూ ప్రధానికి సర్టిఫికెట్ ఇచ్చినవారంతా, ఇప్పుడు అదే నరేంద్ర మోడీ, కరోనా సెకెండ్ వేవ్ బాధ్యుడిగా గుర్తిస్తారా.? అని ప్రశ్నించారు.
ప్రతిదానికీ రాష్ట్రాలు కేంద్రంపై ఆధారపడే పరిస్థితి తీసుకురావడంతోనే, కరోనా విషయంలో ఇంత అలజడి రేగుతోందన్న నాగేశ్వర్, రాష్ట్రాలకు వ్యాక్సిన్, మందులు, ఆక్సిజన్ విషయంలో స్వేచ్చనివ్వాల్సి వుందని అభిప్రాయపడ్డారు. జీవించడం.. అనే హక్కుని ప్రభుత్వాల నిర్వాకం కారణంగా ప్రజలు కోల్పోతున్నారన్న ఆవేదన సర్వత్రా వ్యక్తమవుతోందని నాగేశ్వర్ చెప్పుకొచ్చారు. ఇదిలా వుంటే, ఏపీలో హెల్త్ ఎమర్జనీ పెట్టాలనే డిమాండ్ ఏపీ బీజేపీ నేతల నుంచి వినిపిస్తోంది. మరి, దేశంలో పరిస్థితి ఏంటబ్బా.?