Covid 19: రెమిడిసివిర్ ఇంజెక్షన్ల కొరత.. ఆక్సిజన్ సిలెండర్ల కొరత.. ఆసుపత్రుల్లో పడకల కొరత.. ఇవన్నీ నిజమే. కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ ఇదే పరిస్థితి. ఆఖరికి స్మశానాల్లోనూ సౌకర్యాల ‘కొరత’కు కారణమైంది కరోనా వైరస్. కరోనా అంటేనే జనం భయంతో వణికి చచ్చిపోవాల్సిందేనన్నట్టు తయారైంది పరిస్థితి. ప్రధానంగా న్యూస్ ఛానళ్ళలో లైవ్ కవరేజీలు, ప్రజల్లో భయాందోళనల్ని రేకెత్తిస్తున్నాయి.
స్మశానాల్లో శవాలు కాలుతున్న వైనాన్ని కూడా న్యూస్ ఛానళ్ళు వదలడంలేదు. న్యూస్ ఛానళ్ళు ఇలాంటి విషయాలపై ఎందుకు ఫోకస్ పెడుతున్నాయి.? ప్రభుత్వాల్ని అప్రమత్తం చేయడానికా.? ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయడానికా.? ఈ విషయమై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ఈ మొత్తం తతంగాన్ని తెరవెనుక వుండి నడిపిస్తోన్నది కార్పొరేట్ మాఫియా.. అన్నది మెజార్టీ అభిప్రాయం. ప్రజల్లో కరోనా భయాల్ని ఎంతగా పెంచితే, కార్పొరేట్లకు అంత లాభం. నల్ల బజారుకి మందుల్ని తరలించిచ, తద్వారా ప్రజల్ని దోచుకునేందుకు ఇదో సదవకాశం కార్పొరేట్ సంస్థలకి.
మరీ ముఖ్యంగా ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రుల దందా కరోనా నేపథ్యంలో మూడు పువ్వులు ముప్ఫయ్ లక్షల కాసులు.. అన్నట్టు తయారైంది పరిస్థితి. ఏ కార్పొరేట్ ఆసుపత్రికి కరోనా బాధితుడు వెళ్ళినా లక్షల్లో బిల్లు పడుతోంది. ఇంత ఖర్చు చేసినా ప్రాణం నిలబడుతుందా.? లేదా.? అన్నది అనుమానమే. అంతిమంగా చేరాల్సింది ప్రభుత్వాసుపత్రికే.. అని చాలా కేసులు నిరూపితమయ్యాయి కూడా. రెమిడిసివిర్ మందుకి దేశంలో కొరత లేదు. కానీ, నల్లబజారుకి ఆ మందులెలా తరలి వెళుతున్నాయి.? దీని వెనుక కార్పొరేట్ మాఫియా వుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
మీడియా సహకారం కూడా ఈ మందుకి డిమాండ్ పెరగడానికి కారణంగా చెప్పుకోవచ్చు. అసలు రెమిడిసివిర్ వల్ల పెద్దగా ఉపయోగాల్లేవని వైద్య నిపుణులు చెబుతున్నా జనం వినడంలేదు.. కారణం మీడియాలో నడుస్తున్న పబ్లిసిటీ. ఏదీ ఆశించకుండా న్యూస్ ఛానళ్ళు కార్పొరేట్ మాఫియాకి ఇలా సహకరిస్తున్నాయని ఎలా అనుకోగలం.?