Andhra Pradesh: ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో కొత్తగా 12 వేల 634 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి ఈ రోజు (ఏప్రిల్ 25). కరోనా బారిన పడి ఒక్కరోజే 69 మంది ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. కేసుల తీవ్రత రోజురోజుకీ అత్యంత వేగంగా జరుగుతోంది. ఇంకోపక్క, ఆసుపత్రుల్లో బెడ్ల కొరత, మందుల కొరత, ఆక్సిజన్ కొరతతో రోగులు పడుతున్న వెతలు.. వెరసి పరిస్థితి అత్యంత భయానకంగా తయారైంది.
ప్రభుత్వం తరఫున పడకలు పెంచుతూ, మందుల్ని అందుబాటులోకి తెస్తూ, ఆక్సిజన్ మరింతగా సమకూరుస్తున్నా, అంచనాలకు మించి కరోనా పాజిటవ్ కేసులు నమోదవుతుండడంతో, పరిస్థితి రోజురోజుకీ ఇంకా ఇబ్బందికరంగా తయారవుతోంది. గత ఏడాది కూడా 10 వేలకు పైన కరోనా పాజిటివ్ కేసులు నమోదైనా, అప్పటికంటే ఇప్పుడు దయనీయ పరిస్థితులున్నాయన్నది బాధితుల ఆవేదన. ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీ పెరిగిపోయిందనీ, దాన్ని అదుపు చేస్తే బావుంటుందన్న డిమాండ్లు బాధితుల నుంచి వెల్లువెత్తుతున్నాయి.
కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చినా, పలు ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందించేందుకు ముందుకు రావడంలేదు. మరోపక్క, పరీక్షల పేరుతో నిలువునా దోచేస్తున్నాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం సీటీ స్కాన్ ధరను 3,000 రూపాయలుగా నిర్ణయించి, తగిన ఆదేశాలు కూడా జారీ చేసింది. అయినాసరే, సీటీ స్కాన్ పేరుతో దోపిడీ మాత్రం ఆగలేదన్న ఆవేదన కరోనా బాధితుల నుంచి వ్యక్తమవుతోంది.
యుద్ధ ప్రాతిపదికన రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పేషెంట్ల కోసం బెడ్లను సమకూర్చి, ఆక్సిజన్ అందుబాటులోకి తెస్తే.. అదీ ప్రభుత్వ పరంగా చేస్తే తప్ప, కరోనా అదుపులోకి వచ్చేలా కనిపించడంలేదు. ఇంత జరుగుతున్నా, జనంలో కరోనా పట్ల బాధ్యత అస్సలు కనిపించకపోవడం ప్రభుత్వ యంత్రాంగానికి పెద్ద తలనొప్పిగా మారిపోయింది. నేడు ఆదివారం కావడంతో, మాంసం, చేపల దుకాణాలకి జనం పోటెత్తారు.. అదీ ఫేస్ మాస్కులు లేకుండా. ఇలాగైతే, మహారాష్ట్ర తరహాలో రాష్ట్రంలో కరోనా విస్ఫోటనం కనిపించినా ఆశ్చర్యపోవాల్సిన పని వుండదు.