Coronavirus:ఆసుపత్రికి తీసుకెళ్ళి కరోనా పరీక్ష చేయించి, రిజల్ట్ రాకుండానే ప్రాణం పోతే.? కరోనా టెస్ట్ చేయించడం కోసం వెళుతూ, మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోతే.? ఇవన్నీ కరోనా కథలు కాదు, బాధితులు.. వారి కుటుంబాల వెతలు. సామాన్యుడి పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైపోయింది కరోనా నేపథ్యంలో. శ్రీకాకుళం జిల్లా పలాసలో ఓ మహిళ కరోనాతో చనిపోతే, ఆమె మృతదేహాన్ని టూ వీలర్ మీద తీసుకెళ్ళాల్సి వచ్చింది ఆమె బంధువులకి.
ఇంతకన్నా దయనీయమైన పరిస్థితి ఇంకేముంటుంది.? వుంది, చాలానే వుంది. ఇలాంటివి చాలనే చోటు చేసుకుంటున్నాయి. అంబులెన్సుల దోపిడీ.. పార్తీవ దేహాల్ని దహనం చేయడానికీ, ఖననం చేయడానికీ దోపిడీ.. వెరసి, అత్యంత జుగుప్సాకరమైన స్థితిలో వుంది సమాజం. కరోనా మొదటి వేవ్ సమయంలోనూ ఇలాంటివి చాలానే చూశాం. అంతకు మించి ఇప్పుడు చూస్తున్నాం. అప్పటికీ ఇప్పటికీ ఏం మారిందని.? ఏమీ మారలేదు. పరిస్థితి మరింత దిగజారిందంతే.
ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి.? చనిపోయినవారి అంతిమ సంస్కారాలు కూడా గౌరవప్రదంగా జరగకపోవడమంటే, ప్రభుత్వాలు వుండి వుపయోగమేంటి.? మూడు గంటల్లో బెడ్ కేటాయించాల్సిందేనని ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతున్నారు. తెలంగాణలోనూ ప్రభుత్వ పెద్దలు గట్టిగట్టి మాటలే చెబుతున్నారు. కానీ, వాస్తవ పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా వుంటోంది.
ప్రధానంగా మందుల పేరుతో దోపిడీ కారణంగా మధ్యతరగతి ప్రజానీకం కరోనా వ్యాధితో కాకుండా, ఆసుపత్రులకు చెల్లించాల్సిన బిల్లుల్ని చూసి ప్రాణాలు కోల్పోతున్న దుస్థితి ఏర్పడుతోంది. టెస్టుల దగ్గర్నుంచి అంత్యక్రియల దాకా దోపిడీ అంటే ఎంత దుర్భర పరిస్థితో అర్థం చేసుకోవచ్చు. స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నా, ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. కరోనా విషయంలో కొందరు అక్రమార్కులు మాత్రం నరరూప రాక్షసుల్లా వ్యవహరిస్తూ కరోనా బాధితుల్ని, బాధిత కుటుంబాల్ని దోచేస్తుండడం అత్యంత అమానవీయం.