లార్జర్ దేన్ లైఫ్ చిత్రాలను రూపొందిస్తూ.. అద్భుతమైన విజువల్స్, భారీ బడ్జెట్‌తో సినిమాలను రూపొందిస్తోన్న ఎపిక్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్. ఆయన ఆవిష్కరిస్తోన్న అద్భుతమైన ప్రణయ దృశ్య కావ్యం శాకుంతలం’. మహాభారత ఇతిహాసంలో అద్భుతమైన ప్రేమ ఘట్టంగా చెప్పుకుంటూ ప్రపంచం నలుమూలలున్న పండితుల ప్రశంసలు పొందిన సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలం. దీన్ని ఆధారంగా చేసుకుని.. ‘శాకుతలం’ చిత్రాన్ని గుణ శేఖర్ తెరకెక్కిస్తున్నారు. శకుంతల, దుష్యంత మహారాజు మధ్య ఉన్న అజరామరమైన ప్రణయగాథ ఇది. శకుంతలగా సమంత.. దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటించారు.
‘శాకుంతలం’ చిత్రాన్నిప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున నవంబర్ 4న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇలాంటి దృశ్య కావ్యాన్ని చూస్తున్నప్పుడు ప్రేక్షకుడు మధురమైన అనుభూతికి లోను కావాలి.. ఆ అనుభూతులను తనలో భద్రపరుచుకోవాలనే తలంపుతో ఎపిక్ మేకర్ గుణ శేఖర్.. ‘శాకుంతలం’ సినిమాను 3Dలో ఆందించే ప్రయత్నం చేస్తున్నారు.
”అత్యంత భారీ స్థాయిలో, అత్యద్భుతంగా శాకుంతం చిత్రాన్ని మీకు పరిచయం చేయాలన్నదే మా లక్ష్యం. అందుకే, ఇంతకు ముందు ప్రకటించిన సమయానికి మిమ్మల్ని థియేటర్లలో కలుసుకోలేకపోతున్నాం. ఇప్పటిదాకా అడుగడుగునా మమ్మల్ని ఆదరించిన అభిమానులకు, ప్రేక్షకులకు ధన్యవాదాలు. మా ఈ ప్రయత్నాన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీరందరూ ఆదరిస్తారని నమ్ముతున్నాం. సరికొత్త విడుదల తేదీతో త్వరలో మిమ్మల్ని కలుసుకుంటాం” అని చిత్ర యూనిట్ తెలియజేసింది.
‘శాకుంతలం’ మనసుని హత్తుకునే అందమైన ప్రేమ కథ. ఇందులో భారీ తారాగణం కూడా నటించారు. సచిన్ ఖేడేకర్, కబీర్ బేడీ, డా.ఎం.మోహన్ బాబు, ప్రకరాష్ రాజ్, మధుబాల, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగళ్ల, జిస్సు సేన్ గుప్తా కీలక పాత్రల్లో నటించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ యువరాజు భరతుడి పాత్రలో నటించటం ప్రధాన ఆకర్షణ కానుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, గుణ టీమ్ వర్క్స్ పతాకాలపై నీలిమ గుణ నిర్మాతగా శాకుంతలం సినిమా రూపొందుతోంది.