రేవంత్ రెడ్డి.. తెలంగాణ ఫైర్ బ్రాండ్. ఆయన్ను తన అభిమానులు ముద్దుగా సింహం అని పిలుస్తుంటారు. ఆయన తొడ కొట్టి మరీ ఎవ్వరినైనా చాలెంజ్ చేయగల సత్తా ఉన్న నాయకుడు. తన సొంత నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఓడిపోయినా.. ఎంపీగా గెలిచి తన సత్తా ఏంటో చూపించాడు రేవంత్ రెడ్డి.
రేవంత్ రెడ్డి ఏపనికైనా డేరింగ్ అండ్ డాషింగ్. మధ్యలో ఆగే ప్రసక్తే ఉండదు. పార్టీలో చేరగానే ఆయన్ను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి వరించింది. తర్వాత ఎంపీ అయ్యాడు. ఇప్పుడు ఆయన ఏకంగా కాంగ్రెస్ ను తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలన్న దృఢ నిశ్చయంతో ఉన్నాడు.
ఏదో ఒకటి చేసి తెలంగాణలో కాంగ్రెస్ జెండాను ఎగురవేయాలి.. అంటే తనకు ఒక ప్రాపర్ పదవి ఉండాలి. అదే పీసీసీ చీఫ్. నిజానికి ప్రస్తుతం టీపీసీసీ చీఫ్ గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదో ఉన్నాడు అంటే ఉన్నాడు. ఆయన వల్ల తెలంగాణలో కాంగ్రెస్ కు ఒరిగిందేమీ లేదు. 2021 వరకు టీపీసీసీ చీఫ్ గా ఉత్తమ్ ఉండనున్నారు. ఆ తర్వాత తనే టీపీసీసీ చీఫ్ కావాలని పక్కా ప్రణాళిక వేసి ముందుకెళ్తున్నాడు.
సోషల్ మీడియాలోనూ తగ్గని జోరు
మరోవైపు సోషల్ మీడియాలో కూడా రేవంత్ రెడ్డి ఫుల్లు జోరు మీదున్నాడు. రేవంత్ రెడ్డి సైన్యం సోషల్ మీడియాలో టీఆర్ఎస్ వింగ్ మీద ఓ రేంజ్ లో విరుచుకుపడుతోంది. టీఆర్ఎస్ మాత్రం తక్కువ తిన్నదా? తమ సోషల్ మీడియా వింగ్ ను ఉపయోగించుకొని రేవంత్ పై, కాంగ్రెస్ పై కౌంటర్లు వేస్తూనే ఉంటుంది. ఇలా.. సోషల్ మీడియాలో ఎవరికి వాళ్లు.. వాళ్ల గురించి గొప్పలు చెప్పుకుంటూ ఎదుటి వాళ్లపై ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారు.
ఏది ఏమైనా… ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే… రోజురోజుకూ రేవంత్ రెడ్డికి ఫాలోయింగ్ పెరుగుతోంది. దీంతో తదుపరి పీసీసీ చీఫ్ గా ఇక తానే ఫిక్స్ అని అనుకుంటున్నాడు రేవంత్. ఒకవేళ రేవంత్ ను కాదంటే.. తన సన్నిహితులకైనా పీసీసీ పదవి దక్కాలని హైకమాండ్ వద్ద బాగానే లాబీయింగ్ చేస్తున్నాడట.
ఒకవేళ అది వర్కవుట్ కాకపోతే మనోడి దగ్గర ప్లాన్ బీ కూడా ఉందట. అదే కోదండరాం. అవును.. కోదండరాంను పట్టుకొని ఓ వేదికను ఏర్పాటు చేసుకొని.. ప్రజల్లోకి వెళ్లేందుకు రేవంత్ ప్లాన్ చేస్తున్నాడు. దాని కోసం పాదయాత్రను ప్లాన్ చేస్తున్నాడు. ప్రజలను కలిసి వాళ్ల బాధలు తెలుసుకొని… వాళ్లకు భరోసా ఇవ్వాలన్న ఉద్దేశంతో.. 2021లో పాదయాత్ర చేయాలని నిశ్చయించుకున్నాడు రేవంత్ రెడ్డి.
ఈ దెబ్బతో ఇటు కాంగ్రెస్ నుంచి తనకు మద్దతు రావడంతో పాటు.. టీఆర్ఎస్ పార్టీ పరువును గంగలో కలపొచ్చు.. అన్న సిద్ధాంతంతో రేవంత్ రెడ్డి ముందుకు కదిలేందుకు సమాయత్తం అవుతున్నట్టు తెలుస్తోంది. అందుకే.. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలలో ఎక్కువగా రేవంత్ రెడ్డి పేరే చక్కర్లు కొడుతోంది.