కాంగ్రెస్‌కు భారీ షాక్.. బీజేపీ కండువా కప్పుకున్న కూన శ్రీశైలం గౌడ్

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ బీజేపీలో చేరారు. ఆదివారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆయనకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, సీనియర్ నాయకులు కె లక్ష్మణ్, డీకే అరుణ పాల్గొన్నారు. బీజేపీలో చేరడానికి కొన్ని గంటల ముందే కూన శ్రీశైలం గౌడ్ మేడ్చల్ జిల్లా డీసీసీ అధ్యక్ష పదవికి, కాంగ్రెస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.

ఆరేళ్లుగా కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలు తనను బాధించాయని, ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రజల సమస్యలపై పోరాటంలో పార్టీ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఆయా జిల్లాలకు చెందిన కీలక నేతలను పార్టీలో చేర్చుకునేందుకు బీజీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా శ్రీశైలం గౌడ్‌ను బీజేపీలోకి తీసుకురావడనికి డీకే అరుణతో పాటు మరికొందరు ముఖ్య నేతలు చర్చలు జరిపినట్టుగా సమాచారం.

ఆ చర్చలు ఫలించడంతోనే నేడు కూన శ్రీశైలం గౌడ్ కాషాయ కండువా కప్పుకున్నారు. మరికొంత మంది నేతలు కూడా ఆయన బాటలో నడవనున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇక, 2009 అెసెంబ్లీ ఎన్నికల్లో కుత్బుల్లా‌పూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన కూన శ్రీశైలం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన ఓటమి చెందారు.