సూపర్స్టార్ కృష్ణ మృతికి ప్రముఖుల సంతాపం.

టాలీవుడ్ సూపర్ ‌స్టార్, పద్మభూషణ్ కృష్ణ మంగళవారం తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు. ఆదివారం అర్థరాత్రి కార్డియాక్ అరెస్టు కారణంగా ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో కాంటినెంటల్ ఆసుపత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ మరణించారు. కృష్ణ మరణ వార్త తెలిసి టాలీవుడ్ లో విషాదం నెలకొంది. ఈ విషయం తెలిసిన ఎంతోమంది సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు.

మాటలకు అందని విషాదం ఇది: చిరంజీవి

”మాటలకు అందని విషాదం ఇది.. సూపర్ స్టార్ కృష్ణ గారు మనల్ని వదిలి వెళ్లిపోవడం నమ్మశక్యం కావడం లేదు. ఆయన మంచి మనసు కలిగిన హిమాలయ పర్వతం. సాహసానికి ఊపిరి, ధైర్యానికి పర్యాయ పదం. ధైర్యం, సాహసం, పట్టుదల, మానవత్వం, మంచితనం.. వీటి కలబోత కృష్ణ గారు. అటువంటి మహా మనిషి తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు.. భారత సినీ పరిశ్రమలోనే అరుదు. తెలుగు సినీ పరిశ్రమ సగర్వంగా తలెత్తుకోగల అనేక సాహసాలు చేసిన కృష్ణ గారికి అశ్రు నివాళి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ నా సోదరుడు మహేశ్ బాబుకు, ఆయన కటుంబ సభ్యులందరికీ, అసంఖ్యాకమైన ఆయన అభిమానులకి నా ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియజేసుకుంటున్నాను” అని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ట్వీట్‌ చేశారు.

చిత్రసీమ పెద్దదిక్కును కోల్పోయింది : నందమూరి బాలకృష్ణ

సూపర్‌ స్టార్‌ కృష్ణ మరణంపై నందమూరి బాలకృష్ణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. తెలుగు సినీ వినీలాకాశంలో మరో ధృవతార చేరింది అంటూ ఎమోషనల్‌ అయ్యాడు. నటనలో కిరీటి, సాహసానికే మారుపేరు, సాంకేతికతలో అసాధ్యుడు, స్వయంకృషితో ఎదిగిన సూపర్ స్టార్, అపర దానకర్ణుడు.. ఘట్టమనేని కృష్ణ.. తెలుగులో కౌబాయ్ సినిమాలకు ఆద్యుడు, గూఢచారి( సీక్రెట్ ఏజెంట్ ) సినిమాల్లో ఘనాపాఠి అని తెలిపాడు. సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రక పాత్రల్లో ఘనాపాఠి.వర్ధమాన నటులకు, కళాకారులకు ఆదర్శప్రాయుడు కృష్ణ.. ఆయనలేని లోటు తీర్చలేనిది..సూపర్ స్టార్ కృష్ణగారి మృతితో తెలుగు సినీ పరిశ్రమ పెద్దదిక్కును కోల్పోయింది. టాలీవుడ్ జేమ్స్ బాండ్, విలక్షణ నటుడిగా పేరున్న కృష్ణ గారి మృతి సినీ రంగానికి తీరని లోటు. ఇటీవలే తల్లిని, ఇప్పుడు తండ్రిని కూడా కోల్పోయిన మహేశ్‍బాబుకు ఇది తీరని వేదన -ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నాను. కృష్ణగారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను అంటూ ఎమోషనల్‌ అయ్యాడు.

కృష్ణ సేవలు చిరస్మరణీయం : పవన్ కళ్యాణ్

‘చిత్రసీమలో సూపర్ స్టార్ బిరుదుకి సార్థకత చేకూర్చిన శ్రీ కృష్ణ గారు తుది శ్వాస విడిచారనే విషయం ఎంతో ఆవేదన కలిగించింది. శ్రీ కృష్ణగారు అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారని తెలిశాక కోలుకొంటారని ఆశించాను. ఇప్పుడు ఈ విషాద వార్త వినాల్సి వచ్చింది. శ్రీ కృష్ణ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాను. స్నేహశీలి, మృదుస్వభావి అయిన శ్రీ కృష్ణ గారు ప్రతి ఒక్కరితో ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. మద్రాస్ లో ఉన్నప్పటి నుంచి మా కుటుంబంతో ఆయనకి చక్కటి అనుబంధం ఉంది. తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కథానాయకుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, స్టూడియో అధినేతగా శ్రీ కృష్ణ గారు చేసిన సేవలు చిరస్మరణీయాలు. తెలుగు సినిమా పురోగమన ప్రస్థానంలో ఆయన నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేశారు. విభిన్న పాత్రలు పోషించిన శ్రీ కృష్ణ గారు కౌబోయ్, జేమ్స్ బాండ్ కథలతో తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించారు. పార్లమెంట్ సభ్యుడిగా ప్రజా జీవితంలో కూడా ఆయన తనదైన ముద్ర వేశారు. సినిమా రంగం క్షేమాన్ని కాంక్షించే శ్రీ కృష్ణ గారి మరణం తెలుగు చలనచిత్ర సీమకు తీరని లోటు. ఆయన కుమారుడు శ్రీ మహేష్ బాబు గారికి, ఇతర కుటుంబ సభ్యులకు నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను’ అని చెప్పుకొచ్చాడు.

తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటు : కేసీఆర్

సూపర్‌ స్టార్‌ ఘట్టమనేని కృష్ణ మరణంపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు. కృష్ణ మరణం తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటన్నారు. నటుడిగా, నిర్మాత, దర్శకుడిగా, నిర్మాణ సంస్థగా ఐదు దశాబ్దాల పాటు కృష్ణ అందించిన సేవలను సీఎం గుర్తు చేసుకున్నారు. 350కిపైగా సినిమాల్లో నటించిన సినీ ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసిన ఆయన మరణం సినీ పరిశ్రమ రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. విభిన్న కుటుంబ కథా చిత్రాలతో పాటు ప్రజల్లో సామాజిక స్పృహ కల్పించే సాంఘిక చిత్రాల నటుడిగా కృష్ణ జనాదరణ పొందారన్నారు.

నిజ జీవితంలోనూ సూపర్ స్టార్: సీఎం జగన్

కృష్ణ మృతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. ఆంధ్రా జేమ్స్‌బాండ్‌గా కృష్ణ కీర్తి గడించారని జగన్ కొనియాడారు. నిజజీవితంలోనూ ఆయన మనసున్న మనిషని అన్నారు. ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకే కాక, తెలుగు జాతికి కూడా తీరని లోటని అన్నారు. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబానికి భగవంతుడు మనో ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నట్టు సీఎం జగన్ పేర్కొన్నారు.

కృష్ణ మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది:చంద్రబాబు

సూపర్ స్టార్ కృష్ణ మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన ఇక లేరన్న వార్త తనను కలచివేసిందన్నారు. తెలుగు సినీ పరిశ్రమలో మంచి మనిషిగా, నిర్మాతల హీరోగా, నటశేఖరుడిగా, సూపర్‌స్టార్‌గా అభిమానులతో పిలిపించుకున్న ఆయన మరణం సినీ రంగానికి తీరని లోటని అన్నారు. నటుడిగా, దర్శకుడిగా, స్టూడియో అధినేతగా, తెలుగు సినిమాకు తొలి సాంకేతికతను అద్దిన సాహస నిర్మాతగా కృష్ణను చెప్పుకుంటారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.

కృష్ణ స్ఫూర్తి అజరామరం: వెంకయ్య నాయుడు

సూపర్ స్టార్ కృష్ణ మృతికి మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం తెలిపారు. తెలుగు తెరపై కృష్ణ నింపిన స్ఫూర్తి అజరామరమని కొనియాడారు. సినిమాల్లోని ఆయన పాత్రలు యువశక్తికి చిహ్నంగా ఉండేవన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

చిత్ర పరిశ్రమ అభివ‌ృద్ధికి ఎంతో కృషి చేశారు : రేవంత్

సినీ వినీలాకాశంలో సూపర్ స్టార్ గా వెలిగి, తెలుగు ప్రజల గుండెల్లో నటశేఖరుడిగా నిలిచిన కృష్ణగారి మరణం దిగ్భ్రాంతి కలిగించింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరలని భగవంతుడిని ప్రార్థిస్తూ… కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.

సాహసానికి మరో పేరు : జూ. ఎన్టీఆర్

కృష్ణ గారు అంటే సాహసానికి మరో పేరు. ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు, విలక్షణమైన పాత్రలే కాకుండా, సాంకేతికంగా కూడా తెలుగు సినిమాకు ఎన్నో విధానాలు పరిచయం చేసిన మీ ఘనత ఎప్పటికి చిరస్మరణీయమని జూ.ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.