Coffee With Manchu : ఇదెక్కడి ర్యాగింగురా మావా.! అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. మంత్రి పేర్ని నాని తాజాగా మంచు మోహన్ బాబు ఇంటికి వెళ్ళారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్యా పలు అంశాలపై చర్చలు జరిగి వుండొచ్చుగాక.
ఎంత పరిశ్రమ పెద్దనని మోహన్ బాబు అనుకుంటున్నా.. ‘మా’ అధ్యక్షుడినని మంచు విష్ణు ఉప్పొంగిపోతున్నా, మంత్రి పేర్ని నాని.. తమ ఇంటికి వచ్చి, పరిశ్రమకి సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు వివరించారని, ప్రభుత్వ ఆలోచనల్ని పంచుకున్నారనీ ప్రకటించేసుకుంటే ఎలా.?
మంత్రిగా పేర్ని నాని స్థాయినీ, రాష్ట్ర ప్రభుత్వ స్థాయినీ అది తగ్గిస్తుంది. అందుకేనేమో, మంత్రి పేర్ని నాని వివరణ ఇచ్చుకోక తప్పలేదు. తమ ప్రభుత్వం వ్యక్తిగతంగా ఎవరికీ సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం రాదన్నారు. తాను కూడా ఎవరికీ సంజాయిషీ ఇవ్వడంగానీ, వివరణ ఇవ్వడంగానీ జరగదని స్పష్టం చేసేశారు.
ఓ వివాహ వేడుక (మంత్రి బొత్స సత్యనారాయణ తనయుడి పెళ్ళి) కోసం హైద్రాబాద్ వెళ్ళినప్పుడు, ఆ వేడుకలో మంచు మోహన్ బాబు తన ఇంటికి ఆహ్వానిస్తే, మర్యాదపూర్వకంగా వెళ్ళానని, అది జస్ట్ కాఫీ మీటింగ్ మాత్రమేనని తేల్చేశారు.
అన్నట్టు, కొద్ది రోజుల క్రితమే మంచు విష్ణు, మెగాస్టార్ చిరంజీవి మీద సెటైర్ వేస్తూ, చిరంజీవి – వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవడాన్ని ‘పర్సనల్ మీటింగ్’ అన్నారు. అది నిజానికి పర్సనల్ కాదు, ప్రొఫెషనల్ మీటింగ్. పరిశ్రమకు సంబంధించిన మీటింగ్ అని.. తాజాగా నిరూపితమయ్యింది కూడా.