క్షేత్ర స్థాయిలో అధికారుల పర్యవేక్షణ కొరవడితే, ప్రజలకు మెరుగైన పాలన ఎలా అందించగలం.? ప్రజలెదుర్కొంటున్న సమస్యలకు ఎలా పరిష్కారం దొరుకుతుంది.? అధికారులంటే ప్రభుత్వానికి కళ్ళు, చెవుల్లాంటివారు. సమస్యల పరిష్కారం కోసం క్షేత్ర స్థాయిలో అధికారులు పర్యటించాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, వారికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయో లేదో తెలుసుకోవాలి.. అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. క్షేత్ర స్థాయి పర్యటనల పట్ల నిర్లక్ష్యం చూపే అధికారులకు మెమోలు జారీ చేయాలని ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు సీఎం జగన్. అధికారంలోకి వచ్చాక, తొలిసారి అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇలాంటి ‘మెమో’ ఆదేశాలు జారీ చేశారు.
ప్రస్తుతానికైతే ఇది స్వీట్ వార్నింగ్ లాంటిదేననీ, ముందు ముందు అధికారులపై ప్రభుత్వం కఠిన చర్యలకూ వెనుకాడకపోవచ్చనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. జగన్ సర్కార్, అతి తక్కువ సమయంలోనే మెజార్టీ ప్రజలు సంతృప్తి చెందేలా సంక్షేమ పథకాల్ని అమలు చేస్తున్న విషయం విదితమే. అయితే, సంక్షేమ పథకాల అమలు విషయమై కింది స్థాయిలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ప్రజలు, ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు. స్పందన తదితర కార్యక్రమాల ద్వారా ప్రజలు తమ అసంతృప్తిని ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. దాంతో, ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేసినట్లు కనిపిస్తోంది. కాగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసహనంతో అధికారుల్లోనూ ఒకింత ఆందోళన షురూ అయ్యింది. సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, స్పందన వంటి కార్యక్రమాల ద్వారా అధికారుల పని తీరుపై ప్రభుత్వానికి సమాచారం అందుతుండడం వల్లే, వ్యవస్థలోని లోపాల్ని సరిదిద్దేందుకూ ప్రభుత్వ పెద్దలకు అవకాశం దొరుకుతోందన్నమాట.