YS Jagan: పరీక్షలు, మార్కులు ముఖ్యమే. కానీ, అది సాధారణ పరిస్థితిలో. కరోనా పాండమిక్ నేపథ్యంలో పరీక్షల నిర్వహణ అస్సలేమాత్రం సమర్థనీయం కాదు. ఎందుకో, ఆంధ్రపదేశ్ ప్రభుత్వం.. పరీక్షల పేరుతో విద్యార్థుల ప్రాణాల్ని పణంగా పెడుతోంది.
ఈ విషయమై ఎవరెంతలా విమర్శలు చేస్తున్నా, ఆఖరికి ‘మాకు పరీక్షల కంటే ప్రాణాలే ముఖ్యం’ అని విద్యార్థులు వేడుకుంటున్నా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రం, పరీక్షలు, సర్టిఫికెట్లు, మార్కులే ముఖ్యమని చెబుతున్నారు. ఈ కరోనా మాయదారి కాలంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, కరోనా వైరస్ ప్రభావాన్ని అదుపు చేయడం సాధ్యంకావడంలేదు. ప్రతిరోజూ 10 వేలు, ఆ పైన కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇవి అధికారిక కేసులు. అనధికారికంగా లెక్కలు తీస్తే, పరిస్థితి అత్యంత భయానకంగా కనిపిస్తుంది.
అయినాగానీ, పరీక్షల విషయంలో తగ్గేదే లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాజాగా తెగేసి చెప్పేశారు. ‘ఇప్పడిక చావో రేవో…’ అన్న పరిస్థితుల్లోకి విద్యార్థులు వెళ్ళిపోయారు. ప్రభుత్వం పరీక్షలు నిర్వహిస్తున్నప్పుడు, వాటికి హాజరుకాకపోతే.. విద్యాసంవత్సరం కోల్పోవాల్సి వస్తుంది. పరీక్షలకు వెళితే, జీవితమే కోల్పోవాల్సి రావొచ్చు. అమ్మ ఒడి అంటున్నారు.. ఇంకేవేవో సంక్షేమ పథకాల్ని విద్యార్థుల చదవులు కోసం అందిస్తున్నారు.
అలాంటప్పుడు, పరీక్షల విషయంలో మొండిపట్టుదల ఎందుకు.? రేప్పొద్దున్న కరోనా కారణంగా విద్యార్థులు పరీక్షల వల్ల ప్రాణాలు కోల్పోతే, దానికి బాధ్యత వహించేదెవరు.? ‘మీ మేనమామలా భరోసా ఇస్తున్నా..’ అని పదే పదే చెప్పే జగన్, ఇప్పుడు ఈ విషయంలో మాత్రం ఎందుకిలా వ్యవహరిస్తున్నారో ఎవరికీ అర్థం కావడంలేదు. ప్రమాదకరం మాత్రమే కాదు, అత్యంత ప్రమాదకరమైన ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షల పేరుతో, విద్యార్థుల్ని మరింత ప్రమాదంలోకి నెట్టేయడం అస్సలేమాత్రం భావ్యం కాదు.