TG: ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమావేశాలలో భాగంగా ఒక పార్టీపై మరొక పార్టీ నేతలు విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గురువారం (మార్చి 27) ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మేం కూడా బీఆర్ఎస్ మాదిరిగా కక్షసాధింపు చర్యలకు పాల్పడి ఉంటే కేటీఆర్ పరిస్థితి ఏమిటీ.. ? మేం రివేంజ్ పాలిటిక్స్ చేసి ఉంటే కేటీఆర్ ఇప్పటికే జైల్లో ఉండేవారని అన్నారు.
కొంతమంది ఉంటారు కేవలం సలహాలు సూచనలు మాత్రమే ఇస్తుంటారు తప్ప వాటిని మాత్రం అనుసరించరని రేవంత్ రెడ్డి పరోక్షంగా కేటీఆర్ ని ఉద్దేశించి మాట్లాడారు. డ్రోన్ ఎగరేశాననే చిన్న కేసులో నన్ను జైల్లో పెట్టి నా బిడ్డ లగ్గం చూడకుండా చేశారు. చర్లపల్లి జైలు నుంచి ఎన్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్కి వెళ్లి లగ్గంపత్రికను రాసుకున్నాం. జైల్లో నన్ను నిద్రపోనివ్వకుండా చేశారు. బల్లులు ఉన్న గదిలో నన్ను వేశారు. నన్ను ఉంచిన సెల్ లో ట్యూబ్ లైట్లు కూడా బంద్ చేయకపోయేది. లైట్లు ఆఫ్ చేయాలని అడిగితే చెయొద్దని పై నుంచి ఆదేశం ఉందని చెప్పేవారు.
ఇలా రాత్రిపూట జైలులో నిద్రలేక ఉదయం చెట్ల కింద నిద్రపోయే వాడిననీ రేవంత్ రెడ్డి తెలిపారు.16 రోజులు నిద్రలేని రాత్రులు గడిపానని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. నేను కూడా బీఆర్ఎస్ లాగా కక్ష సాధింపు చర్యలు చేస్తే మీ కుటుంబంలో ఒక్కరు కూడా నేడు బయట ఉండరు అందరూ కూడా చర్లపల్లి జైలులో ఉండేవారు అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడారు.కూలీ డబ్బులు ఇచ్చి ప్రభుత్వాన్ని, నన్ను, నా కుటుంబాన్ని పచ్చిబూతులు తిట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు.