TG: పదేళ్లు తెలంగాణకు పట్టిన చంద్రగ్రహణం వీడింది… కేసీఆర్ పై రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

TG: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీలు దొరికినప్పుడల్లా కేసీఆర్ కేటీఆర్ ల పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తూ ఉంటారు. అయితే మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రేవంత్ రెడ్డి పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ఈయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఈయన ఇందిరా మహిళా శక్తి బస్సులను ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న విషయం తెలిసిందే. అయితే గత పది సంవత్సరాల కాలంలో తెలంగాణకు చంద్రగ్రహణం పట్టిందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇలా పదేళ్ల నుంచి ఉన్న ఈ చంద్రగ్రహణం వీడిపోవడంతో ఆడబిడ్డలు ఆత్మ గౌరవంతో నిలబడి స్వేచ్ఛగా ఉన్నారని అన్నారు.

తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రావాలని ప్రతి ఒక్క ఆడబిడ్డ కోరుకున్నారు అందుకే వారీ ఆశీర్వాదంతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని రేవంత్ గుర్తు చేశారు. ఇందిరమ్మ రాజ్యంలోనే మహిళలు కోటీశ్వరులుగా మారుతున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. కెసిఆర్ కాంగ్రెస్ పాలనలో తేడాలను మహిళలందరూ కూడా గుర్తిస్తున్నారని తెలిపారు.

భవిష్యత్తులో మహిళా సంఘాలు కార్పొరేట్‌ కంపెనీలతో పోటీ పడేవిధంగా తీర్చిదిద్దుతామని రేవంత్ తెలిపారు. తెలంగాణలో 65 లక్షల మంది మహిళలు స్వయం సహాయక సంఘాల్లో ఉన్నారని తెలిపారు. ప్రభుత్వ స్కూళ్ల నిర్వహణను స్వయం సహాయక సంఘాలకు అప్పగించామని అన్నారు. స్కూల్ పిల్లలకు యూనిఫాంలు కుట్టే బాధ్యతలను కూడా వారికే ఇస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు ఇలా మహిళా సాధికారత పెంపొందింప చేస్తూ మహిళలను మహారాణులుగా చేయటం ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యమవుతుందంటూ రేవంత్ మహిళలను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.