Gaddar Awards: సినీ పరిశ్రమను గౌరవించుకోవాలన్నదే మా ఉద్దేశం.. సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ వైరల్!

Gaddar Awards: తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాదులో గద్దర్ ఫిలిం అవార్డ్స్ కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. శనివారం రోజు జరిగిన ఈ కార్యక్రమంలో గద్దర్ ఫిలిం అవార్డ్స్ ను అందజేశారు. ఈ వేడుకకు సినీ సెలెబ్రెటీలతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు సైతం హాజరయ్యారు. ఈ అవార్డ్స్ ప్రధాన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి అయిన భట్టి విక్రమార్క, మంత్రి కోమటరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని సినీ ప్రముఖులకు అవార్డులను అందజేశారు.

సినీ పరిశ్రమ నుంచి నందమూరి బాలకృష్ణ, అల్లు అర్జున్‌, రాజమౌళి, అల్లు అరవింద్‌, దిల్‌ రాజు, సుకుమార్‌, విజయ్‌ దేవరకొండతో పాటు మరికొందరు హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తన చేతుల మీదుగా చాలామంది హీరోలకు గద్దర్ అవార్డులను అందజేశారు. ఈ అవార్డులను అందజేసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి చాలా సేపు మాట్లాడుతూ అనేక అంశాల గురించి చర్చించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం కఠినంగా కనిపిస్తుంది కానీ.. సినీ పరిశ్రమకు అవసరమైన ప్రోత్సాహం అందిస్తుందని అన్నారు.

సినీ పరిశ్రమను గౌరవించుకోవాలన్నదే తమ ఉద్దేశం అని రేవంత్‌ రెడ్డి తెలిపారు. 14 ఏళ్ల తర్వాత మళ్లీ అవార్డుల ప్రధానోత్సవం ప్రారంభించడం సంతోషంగా ఉంది. గతంలో నంది అవార్డులను కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వమే ప్రవేశ పెట్టింది. హాలీవుడ్‌, బాలీవుడ్‌ కాదు ప్రపంచ సినిమా తెలంగాణ గడ్డపై ఉండాలంటే ఏం చేయాలో ఏం కావాలో చెప్పండి అన్ని విధాల ప్రోత్సాహం అందిస్తామని అంటూ హామీ ఇచ్చారు. తెలుగు సినిమా పరిశ్రమ అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి అయ్యాలా తమ వంత సాయం అందిస్తామని అన్నారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.