కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్ప.. ఎప్పుడు ‘మాజీ’ అయిపోతారట.? ఈ చర్చ కర్నాటక రాజకీయాల్లోనే కాదు, దేశ వ్యాప్తంగానూ చర్చనీయాంశమవుతోంది. అయినా, యడియూరప్పకి ఇదేమీ కొత్త కాదు. ఎందుకంటే, గతంలోనూ పలు సందర్భాల్లో ఆయన ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు. యడియూరప్ప చాలా సీనియర్ పొలిటీషియన్. బోల్డంత పాపులారిటీ వున్న నాయకుడు. అదే సమయంలో, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ కూడా. కర్నాటకలో ఎమ్మెల్యేల కొనుగోళ్ళు, అధికార మార్పిడి.. ఇవన్నీ సర్వసాధారణం. దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ లేనంత చిత్ర విచిత్రమైన రాజకీయ పరిస్థితులు కర్నాటకలో కనిపిస్తాయి. యడియూరప్ప నేతృత్వంలోని బీజేపీ, కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు దక్కించుకున్న పార్టీగా అయితే నిలబడిందిగానీ, అధికార పీఠమెక్కడానికి అవసరమైన మెజార్టీ మాత్రం సాధించలేకపోయింది.
తొలుత యడియూరప్ప ముఖ్యమంత్రి అయ్యారు.. కొద్ది రోజులకే ఆయన ముఖ్యమంత్రి పదవి వదలుకున్నారు, కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యారు. కుమారస్వామి ప్రభుత్వం కూలిపోయి, యడియూరప్ప ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడాయన పదవి తుమ్మితే ఊడిపోయే ముక్కులా తయారైంది. ఔను, అధిష్టానం ఎప్పుడు దిగిపోమంటే, అప్పుడు యడియూరప్ప రాజీనామా చేసెయ్యాలి. అధిష్టానం నుంచి ఆదేశాల కోసం యడియూరప్ప ఎదురుచూస్తున్నారు. సింపుల్‌గా చెప్పాలంటే, అదొక నామినేటెడ్ పదవిలా తయారైంది. ‘ఆదివారం రాత్రి వరకూ వేచి చూశా.. ఈ రోజు మా ప్రభుత్వం భవితవ్యమేంటో తేలిపోతుంది..’ అంటూ యడియూరప్ప చేసిన వ్యాఖ్యలే ఆయన పరిస్థితిని చెబుతున్నాయి. దేశంలో ఎంతటి దిక్కుమాలిన రాజకీయాలు రాజ్యమేలుతున్నాయో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? యడియూరప్ప దిగిపోతారు సరే.. ఆ తర్వాత అధికార పీఠమెక్కేదెవరు.? ఆ ముక్కు.. ఎవరు తుమ్మతే ఊడిపోతుంది.?