బుక్ మై షో యాప్ లేదా వెబ్ సైట్ ద్వారా సినిమా టిక్కెట్లను ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకునే వీలుంది. ఇది ఎప్పటినుంచో నడుస్తున్న వ్యవహారమే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా వెబ్ సైట్ పెట్టి, దాని ద్వారా సినిమా టిక్కెట్లను విక్రయించేందుకు సమాలోచనలు చేస్తోంది. ప్రైవేటు సంస్థ నడిపే టిక్కెట్ల బుక్కింగ్ వెబ్‌సైట్.. ప్రభుత్వం నడిపే వెబ్‌సైట్ మధ్య తేడా ఏముంటుంది.? ఏమీ వుండకపోవచ్చు. కానీ, టిక్కెట్ల ధరల నియంత్రణ.. అంశమే అసలు సమస్య. సంపూర్ణేష్‌బాబు సినిమా అయినా, పవన్ కళ్యాణ్ సినిమా అయినా ఒకటేనంటూ ఏపీ మంత్రి అనిల్ వ్యాఖ్యానించారు. కానీ, అది నిజం కాదు. సంపూర్ణేష్‌బాబు సినిమా బడ్జెట్ వేరు, పవన్ కళ్యాణ్ సినిమా బడ్జెట్ వేరు. ఇక్కడ పవన్ కళ్యాణ్‌లాంటి మంచి వ్యక్తితో తనను పోల్చినందుకు ఆనందంగా వుందంటూ మంత్రి అనిల్‌కి కృతజ్ఞతలు తెలిపారు సంపూర్ణేష్. అది వేరే సంగతి. చీప్ లిక్కర్.. ఖరీదైన లిక్కర్.. చిన్న ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం, పెద్ద ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం.. ఇలా దేన్ని తీసుకున్నా.. రకరకాల రేట్లు వుంటాయ్.
సినిమాకి కూడా ఏసీ థియేటర్లలో ఒకలా, పల్లెటూళ్ళలోని సాధారణ థియేటర్లలో ఇంకోలా రేట్లు వుంటాయ్. ఇక, సీజన్ బట్టి సిమెంట్ బస్తాల రేట్లు, కూరగాయల రేట్లు పెరిగిపోతాయ్.. నిత్యావసర వస్తువుల ధరల సంగతి సరే సరి. వీటి విషయంలో ప్రభుత్వాలు ఎప్పుడూ శ్రద్ధ పెట్టిన దాఖలాలుండవ్. సినిమా టిక్కెట్ల విషయంలో వైఎస్ జగన్ సర్కారు ఎందుకు ప్రతిష్టకు పోతోందోగానీ, ఇది అనవసర వివాదంగా మారుతోంది. పాన్ ఇండియా అనే రేంజ్ దాటి.. అంతర్జాతీయ స్థాయి సినిమాల వైపుగా తెలుగు సినీ పరిశ్రమ అడుగులేస్తోంది. టిక్కెట్ ధర వెయ్యి రూపాయలు పెడితే, ప్రేక్షకుడెలాగూ సినిమాకి వెళ్ళడు. సో, ఆ స్థాయిలో దోచుకోవాలని ఏ నిర్మాత కూడా అనుకోడు. బ్లాక్ మార్కెట్టులో ఇసుక ధర అమాంతం పెరిగిపోయినా, తప్పక భరిస్తున్నాడు సామాన్యుడు. ఇలాంటి విషయాలన్నీ పరిగణనలోకి తీసుకుని, వివాదానికి ముగింపు పలికేలా రాష్ట్ర ప్రభుత్వమే ముందడుగు వేయాల్సి వుంటుంది. పవన్ కళ్యాణ్ విమర్శలనేవి.. రాజకీయ కోణంలో పక్కన పెట్టేసి, పరిశ్రమ పెద్దలతో, పరిశ్రమ సమస్యల పట్ల స్పందిస్తే.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి రాజకీయంగా అది లాభమే చేకూర్చుతుంది.