Chiru Says : ‘నా తమ్ముడు పవన్ కళ్యాణ్ ఏది మాట్లాడినా అందులో న్యాయం వుంటుంది. న్యాయం కోసం పవన్ ఎందాకైనా పోరాడగలడు.. నా తమ్ముడి నిబద్ధత పట్ల నాకు పూర్తి నమ్మకం వుంది..’ అంటూ మెగాస్టార్ చిరంజీవి, తన సోదరుడు పవన్ కళ్యాణ్‌పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
నిజానికి, చిరంజీవి ఎప్పుడూ ఇదే మాట చెబుతుంటారు.. ఎప్పుడు పవన్ కళ్యాణ్ గురించి ఎవరు తన వద్ద ప్రస్తావించినాసరే. అన్నదమ్ముల మధ్య ఈ అనుబంధం ఎప్పుడూ ఇలాగే వుంటుంది. అది అందరికీ తెలిసిన విషయమే. అయినాగానీ, కొన్ని సందర్భాల్లో చిరంజీవి ఆలోచనలకీ, పవన్ కళ్యాణ్ ఆలోచనలకీ అస్సలు పొంతన వుండదు.
సినిమా టిక్కెట్ల వ్యవహారానికి సంబంధించి, ‘ప్రభుత్వాల్ని బతిమాలుకుంటే కుదరదు.. ప్రశ్నించాలి..’ అంటూ పరోక్షంగా తన అన్నయ్య చిరంజీవినే ప్రశ్నించేశారు మొన్నామధ్య జనసేన అధినేత పవన్ కళ్యాణ్. చిరంజీవి సహా సినీ పరిశ్రమ ప్రముఖలందర్నీ ఉద్దేశించి పవన్ ఆ వ్యాఖ్యలు చేశారు.
పవన్ మాట్లాడిన మాటలు చాలామందిని బాధించాయి. కొందరైతే, ‘మీరు పవన్ కళ్యాణ్ వైపు వుంటారా.? సినీ పరిశ్రమ వైపు వుంటారా.?’ అంటూ ప్రశ్నను లేవనెత్తి, పవన్ కళ్యాణ్‌ని సినీ పరిశ్రమ నుంచి దూరంగా చూపించే ప్రయత్నమూ చేశారు.
కానీ, ఇప్పుడు సినీ పరిశ్రమలో అంతా ఒక్కతాటిపైకి వస్తున్నారు. పరిశ్రమ సమస్యలపై తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలతో చర్చించాలనీ, ఈ క్రమంలో ఒకర్నొకరు కలుపుకుపోవాలనీ భావిస్తున్నారు. ఇదే కదా పవన్ కళ్యాణ్ గతంలో చెప్పింది. అందుకే, అన్నయ్య చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని సమర్థిస్తూ తాజాగా మాట్లాడాల్సి వచ్చిందని అనుకోవాలేమో.